లేటు రైలుతో 500 మందికి నీట్‌ మిస్

లేటు రైలుతో 500 మందికి నీట్‌ మిస్

రైలు కారణంగా ఏకంగా 500 మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. బళ్ళారి, హుబ్లికి చెందిన దాదాపు 500 మంది విద్యార్థులకు బెంగళూరు సెంటర్‌ వేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు నగారానికి చేరే హంపి ఎక్స్‌ప్రెస్‌ను వీరు ఎక్కారు. 16591 హంపి ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ ఉదయం 7 గంటలకు రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 2.30కిగాని అంటే ఆరు గంటల ఆలస్యంతో రైలు బెంగళూరు చేరనుంది. అక్కడి నుంచి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ దయానంద్‌ సాగర్‌ కాలేజీకి వీరు చేరుకోవాల్సి ఉంది. 2 గంటలు దాటితే పరీక్ష హాల్‌లోకి విద్యార్థులను రానివ్వరు. అంటే వీరందరూ ఇవాళ పరీక్ష రాయనట్లే. దీంతో విద్యార్థులందరూ సామాజిక మీడియా ద్వారా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. తమకు పరీక్ష రాసేందుకు అనుమతించాలని వీరు కోరుతున్నారు.

సిద్ధరామయ్య ట్వీట్‌
మరోవైపు రైలు ఆలస్యంపై మాజీ సీఎం సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇతర నేతల విజయాలను తమ గొప్పలుగా చెప్పుకునే మోడీ గారూ... మీ  సహచర కేబినెట్‌ మంత్రుల వైఫల్యాలకు బాధ్యత తీసుకుంటారా' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. రైళ్ళు సకాలంలో చేరకపోవడంతో తమ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు నీట్‌ రాయలేకపోయారని ఆయన ఆరోపించారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మోడీని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ చర్యలు తీసుకోవాలన్నారు.