ప్రకాశం జిల్లా శానిటైజర్ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్...

ప్రకాశం జిల్లా శానిటైజర్ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్...

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటన కేసులో కీలక వ్యక్తులను హైదరాబాద్‌ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ‘పర్ఫెక్ట్‌’ శానిటైజర్ కంపెనీ యజమాని, ముడిసరుకును సరఫరా చేసిన ఇద్దరు మార్వాడీలు మరో ఇద్దరు డిస్ట్రీబ్యూటర్స్ ఉన్నారు. నిందితులను హైదరాబాద్‌ నుంచి నిన్న ఉదయం కురిచేడుకు తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివి స్ధానికంగా పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 

ఇక ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు చెప్పటాడు. ఈ వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్‌లో శానిటైజర్ ఫార్ములా విధానాన్ని నేర్చుకుని స్వయంగా తయారు చేయడం ప్రారంభించాడు. ఈ శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను వినియోగించడంవల్లే మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. కురిచేడు లోని కొన్ని మెడికల్‌ షాపులకు శానిటైజర్లు సరఫరా చేసినట్లు రికార్డు ఆధారాలను గుర్తించారు. జిల్లాలో పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ మార్కెటింగ్ కు దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసి స్థానికంగా అమ్మకాలు సాగించినట్లు విచారణలో బయటపడింది.