యూట్యూబ్ లో అరైవ్డ్ షో సూపర్ హిట్

యూట్యూబ్ లో అరైవ్డ్ షో సూపర్ హిట్

మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏఆర్ రహమాన్ తన సరికొత్త రియాలిటీ సింగింగ్ షో అరైవ్డ్ (ARRived) మొదటి ఎపిసోడ్ ని యూట్యూబ్ లో లాంచ్ చేసి ఐదు రోజులవుతోంది. ఈ షో విజేతతో డిసెంబర్ 21న విడుదలవుతున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జీరో‘లో పాడించబోతున్నాడు రహమాన్. ఈ షోకి సంబంధించిన గీతాన్ని ఇంతకు ముందే విడుదల చేశాడు ఆస్కార్ అవార్డ్ విజేత. షారుఖ్ కూడా ఈ వీడియోలో కనిపించాడు. రహమాన్ తో పాటు ప్రముఖ సింగర్స్ షాన్, క్లింటన్ సెరెజో, విద్యా వోక్స్ ఈ సిరీస్ కి జడ్జిలుగా వ్యవహరిస్తారు. 

నవంబర్ 8న రహమాన్ యూట్యూబ్ చానల్ లో ఈ షో దర్శనమిచ్చింది. దీంతో పాటే యూట్యూబ్ ప్రోగ్రామింగ్ సర్వీస్ యూట్యూబ్ ఒరిజినల్స్ భారత్ లో ప్రారంభమైంది. దేశంలో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ వసూలు చేయడం మొదలు పెట్టేవరకు యూట్యూబ్ దీనిని యాడ్-సపోర్టెడ్ ప్లాట్ ఫామ్ పై నడపాలనుకుంటోంది. ఏఆర్ రహమాన్, శేఖర్ కపూర్, సమీర్ బంగారా సంయుక్తంగా ప్రారంభించిన డిజిటల్ మీడియా సర్వీస్ ఖ్యూకీ ఈ షోకి భాగస్వామిగా వ్యవహరిస్తుంది. 

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోని టీవీ చానెళ్లకు భిన్నంగా ఇందులో నాటకీకరణ ఉండకపోవడంతో ప్రేక్షకులు విపరీతంగా కనెక్టవుతున్నారు. కేవలం పోటీదారుల ప్రతిభను మాత్రమే పరిగణిస్తుండటంతో యువ కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ షోలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జడ్జిలు కూడా నిస్సంకోచంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో జడ్జిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది గాయకులను ఎంపిక చేశారు. వీరిని మెంటార్స్ బూట్ క్యాంప్ లో శిక్షణ, పాడటంలో మెలకువలు నేర్పిస్తారు. వీరంతా రెండో రౌండ్ లో పోటీ పడతారు. రాబోయే రోజుల్లో రహమాన్ యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మిగతా 12 భాగాలను విడుదల చేస్తారు.