డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు 

డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు 

అరుణాచల్ ప్రదేశ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏకంగా  ఉప ముఖ్యమంత్రి చోవనా మెయిన్‌కు ఈటా నగర్‌లో ఉన్న బంగళాకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో చోవనా ఈటా నగర్ నుంచి నమ్‌సాయ్ జిల్లాకు వెళ్ళిపోయారు. స్థానికేతరులకు శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం చోవనా మెయిన్‌కు ఈటా నగర్‌లో ఉన్న బంగళాకు నిరసనకారులు నిప్పు పెట్టారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో పోలీసు అత్యున్నత స్థాయి అధికారి ఒకరు గాయపడ్డారు.

స్థానికులు కానటువంటి కొన్ని జాతులవారు అరుణాచల్ ప్రదేశ్‌లో దశాబ్దాల నుంచి నివసిస్తున్నారు. వీరికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇచ్చేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈటా నగర్‌లో సుమారు 50 కార్లను తగులబెట్టారు, దాదాపు 100 వాహనాలను ధ్వంసం చేశారు. 5 సినిమా థియేటర్లకు నిప్పు పెట్టారు. ప్రభుత్వం సైన్యాన్ని పిలిచింది. ఈటా నగర్‌లో సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఈటా నగర్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేశారు, కర్ఫ్యూ విధించారు.