ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ని కలిసిన గోవా కాంగ్రెస్

ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ని కలిసిన గోవా కాంగ్రెస్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంపై దేశం నివాళులు అర్పిస్తుండగానే, రాష్ట్రంలో అధికార బీజేపీకి భాగస్వామ్య పక్షాల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. రెండు పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో స్వల్ప మెజారిటీ సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలం పార్టీ సోమవారం అధికారం నిలబెట్టుకొనేందుకు తంటాలు పడుతోంది. మనోహర్ పారికర్ వారసుడి రేసులో బీజేపీ నేత ప్రమోద్ సావంత్ కి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్ పి) అతడిని అంగీకరించడం లేదని తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ అధికార నివాసానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకి తమను ఆహ్వానించాలని గవర్నర్ మృదులా సిన్హాను కోరారు.

పారికర్ మరణంతో ప్రభుత్వానికి చిక్కులు ఎదురు కావచ్చని భావించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాకి వచ్చి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపారు. ఉదయం 5.30కి ఈ భేటీ ముగిసింది. సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ పేరుని అంగీకరించని భాగస్వామ్య పార్టీలు పరిష్కారం వచ్చే వరకు అసెంబ్లీని అచేతన స్థితిలో ఉంచడానికే మొగ్గు చూపుతామని అన్నారు. మరో బీజేపీ నేత వినయ్ టెండూల్కర్ ని సీఎంని చేస్తే అంగీకరిస్తామని రెండు పార్టీలు చెప్పాయి. గడ్కరీతో భేటీ తర్వాత ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు మొత్తం 9 మంది జీఎఫ్ పి చీఫ్ విజయ్ సర్దేశాయ్ ఇంట్లో సమావేశం అయ్యారు. 

మరోవైపు కాంగ్రెస్ కి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ మృదుల సిన్హాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్ధత వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) పానాజీలో సమావేశమైంది. గవర్నర్ తమకు అప్పాయింట్ మెంట్ నిరాకరించినందువల్ల రాజ్ భవన్ వరకు పాదయాత్రగా వెళ్లాలని తమ ఎమ్మెల్యేలంతా నిర్ణయించినట్టు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావ్లేకర్ చెప్పారు. 

40 మంది సభ్యుల అసెంబ్లీలో 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీకి 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా, ఇప్పుడు పారికర్ మరణాలతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుభాష్ శిరోద్కర్, దయానంద్ సోప్టే గత ఏడాది రాజీనామా చేశారు.