బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. మా గెలుపునకు ఎంఐఎం హెల్ప్..!
తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ వస్తుంది.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తూ వస్తుంది. దీనిపై అనే రకాల ఆరోపణలే ఉన్నాయి.. బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికే ఎంఐఎం అధినేత అన్ని చోట్ల పోటీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ఆయా రాష్ర్టాల్లో బీజేపీ గెలుపునకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తోడ్పాటు అందిస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారాయన.. ఇక, ఎంఐఎం వల్లే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్నా ఆయన.. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తుందంటూ ప్రకటించారు బీజేపీ ఎంపీ. దీంతో.. అక్కడ కూడా బీజేపీ గెలుపుకు అసదుద్దీన్ ఒవైసీ సహకరించబోతున్నారంటూ వ్యాఖ్యానించిన సంచలనానికి తెరలేపారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భార్‌తో సమావేశమైన ఒవైసీ.. పలు కీలక అంశాలపై చర్చించారని చెబుతున్నారు.. యూపీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీపైనే ఫోకస్ పెట్టారనే ప్రచారం సాగుతోంది.. ఇదే సమయంలో.. పశ్చిమ బెంగాల్, యూపీలో బీజేపీ గెలుపునకు ఎంఐఎం తోడ్పాటునిస్తుందంటూ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించడం చర్చగా మారింది. అయితే, ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా.. బీజేపీయేతర పార్టీలకు నష్టం చేకూరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎంఐఎం పోటీ చేసిన స్థానాల్లో తక్కువ ఓట్లతో కాంగ్రెస్ మిత్ర పక్షాలకు చెందిన అభ్యర్థులు ఓడిపోయారనే విశ్లేషణలు కూడా వెలువడిన సంగతి తెలిసిందే. ఓవైపు.. పొద్దున్న లేస్తే.. ఎంఐఎంపై ఒంటికాలిపై లేచే బీజేపీ నేతలు.. ఇలా ఎంఐఎం సహాయం తీసుకోవడం ఏంటి? అనే చర్చ సాగుతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)