రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి: గెహ్లాట్

రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి: గెహ్లాట్

దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎటు చూసినా తీవ్ర ఆవేదనలో ఉన్నారని కాంగ్రెస్ నేత అశోక్‌గెహ్లాట్‌ అన్నారు. అమరావతిలో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆరోపించారు. ఇలాంటి దుస్థితి స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేదన్నారు. ఆదాయం పెరిగే మార్గాలు, వ్యవస్థను నిర్మించే ఆలోచనలు వీరికి ఏమాత్రం లేవని, ఐటీ, సీబీఐ, ఈడీ అన్ని వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు కలిశారని తెలిపారు. ఆరెస్సెస్‌, బీజేపీలాంటి శక్తులకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, నవంబర్‌ 1న రాహుల్‌, చంద్రబాబు సమావేశంలో చర్చించిన విషయాలపై ఎలా ముందుకు వెళ్లాలనేదిదానిపై చర్చించేందుకే వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా సేవ్‌ డెమోక్రసీ పేరుతో కూటమిగా ఏర్పడుతున్నామని అశోక్‌గెహ్లాట్‌ చెప్పారు.