వీడియో: మనీష్ పాండే సూపర్‌ క్యాచ్‌

వీడియో: మనీష్ పాండే సూపర్‌ క్యాచ్‌

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ లోని ఎండవేడిమి తట్టుకుని వరుసగా రెండు మ్యాచ్ లలో విజయాలను సొంతచేసుకోవడంతో టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా మనీష్‌ పాండేపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత పార్ట్ టైం స్పిన్నర్ కేదార్‌ జాదవ్‌ వేసిన 25 ఓవర్‌ ఐదో బంతిని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ భారీ షాట్‌కు కొట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే  బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి.. బౌండరీ లైన్‌ను దాటి వచ్చి మళ్లీ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు పాండేను అభినందించారు. పాండే గాయపడ్డ హర్ధిక్‌ పాండ్యా స్థానంలో సబ్స్ట్యూడ్ ఫీల్డర్ గా వచ్చాడు.

 

ఇదే మ్యాచ్ లో అంబటి రాయుడు కూడా అద్భుత ప్రదర్శన చేసాడు. రెండు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులో పాతుకుపోయి పాక్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టిన సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌(43)ను రాయుడు అద్బుత ఫీల్డింగ్‌తో రనౌట్‌ చేసాడు. జాదవ్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతిని మాలిక్‌ ఆఫ్ సైడ్ మీదుగా ఆడి పరుగు కోసం ప్రయత్నించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాయుడు చురుగ్గా స్పందించి విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకడంతో మాలిక్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మనీష్ పాండే సూపర్‌ క్యాచ్‌, అంబటి రాయుడు అద్బుత ఫీల్డింగ్‌ వీడియోలు నెట్టింట్లో  వైరల్ గా మారాయి.