అసెంబ్లీలో జగన్‌ x బాబు..!

అసెంబ్లీలో జగన్‌ x బాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇవాళ తొలిరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై వాదోపవాదాలు జరిగాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లడాన్ని టీడీపీ తప్పుబట్టింది. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌.. తాను వెళ్లినా వెళ్లకపోయనా ఆ ప్రాజెక్టు ప్రారంభమయ్యేదేనని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళితే తప్పేంటన్న జగన్‌.. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం వెళ్లానని వెల్లడించారు. ఐదేళ్లు బాబు సీఎంగా ఉన్న సమయంలోనే  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని.. అప్పుడు ఆయన 'గాడిదలు కాశారా' అని ప్రశ్నించారు.  ఇక.. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నప్పుడే ఆల్మట్టి డ్యాం ప్రాజెక్టు కట్టారని జగన్‌ గుర్తు చేశారు. 

జగన్‌ కామెంట్స్‌పై బాబు దీటుగా స్పందించారు. తన రాజకీయ అనుభవమంత వయసు జగన్‌కు లేదన్నారు. గట్టిగా మాట్లాడితే తాము భయపడిపోతామనుకోవడం భ్రమేనని అన్నారు.  కేసీఆర్ హిట్లర్ అని, కాళేశ్వరం వస్తే తెలంగాణ, ఆంధ్ర పాకిస్థాన్ మాదిరి అవుతుందని జగన్‌ గతంలో చెప్పారని గుర్తు చేశారు.