ఆ "రాంగ్ నెంబర్" అమ్మాయిని ఇలా పట్టేశాడు

ఆ "రాంగ్ నెంబర్" అమ్మాయిని ఇలా పట్టేశాడు

నవలా నాయిక అందులోని హీరోకు కొన్ని క్లూస్ ఇచ్చి తనను పట్టుకోమని సవాల్ విసిరే ఇతివృత్తాలు కొత్తేం కాదు. దాని చుట్టే కథంతా నడుస్తూ... ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ.. మధ్యమధ్యలో ఇద్దరూ కలుసుకున్నా.. ఎవరేమిటో తెలియకుండా దెబ్బలాడుకోవడం వంటి ఘటనలతో.. నవల చదివే ప్రేక్షకుల్లో టెన్షన్ క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. అయితే అచ్చంగా అలాంటి ఇతివృత్తమే కెనడాలోని కార్లోస్ జెటినా జీవితంలో చోటు చేసుకుంది. 

ఆ వివరాలు చదవండి..
కెనడాలో చదువుకుంటన్న ఓ విద్యార్థి కార్లోస్ జెటినా. ఈయన మొన్న గురువారం అనుకోకుండా  నికోలి అనే అమ్మాయిని కలిశాడు. తొలి కలయికలోనే ఇద్దరి మధ్యా మాటలు కలిశాయి. ఆ తరువాత వెళ్లిపోయే ముందు అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకున్నాడు.. జెటినా. అయితే ఆ యువతి పేరైతే చెప్పింది కానీ... అసలు నెంబర్ ఇవ్వకుండా రాంగ్ నెంబర్ తో ప్రస్తుత డ్రామాకు తెర లేపింది. 

ఆ విషయం తెలియని జెటినా.. నికోలితో మాట్లాడాలనే తహతహలో చాలాసార్లు ఫోన్ చేశాడు. ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చి తప్పుదోవ పట్టించిందని తెలిసినా మరో మార్గం గుండా ప్రయత్నించాడు. వెంటనే మరుసటి రోజు రాత్రి.. కాల్గరీ యూనివర్సిటీలో చదువుకునే నికోలి అనే పేర్లు గల అమ్మాయిలందరి ఈమెయిల్స్ కు మెసేజ్ పెట్టాడు. "నిన్న రాత్రి కలిశాను.. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు" అని సబ్జెక్టు లైన్లో టైప్ చేసి 246 మందికి ఈ మెయిల్స్ పంపాడు. అయితే జెటినా వేదికే అసలైన నికోలికి యూనివర్సిటీ మెయిల్ ఐడీ లేకపోవడంతో.. ఇతగాడి తాపత్రయం ఆమెకు చేరలేదు. మరోవైపు జెటినా మెయిల్ అందుకున్న నికోలి అనే పేరు గల అమ్మాయిల్లో ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరినీ కలిపేందుకు తమ వంతుగా ప్రయత్నిద్దామని కొందరు పూనుకున్నారు.. అందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. 

ఒక యువతి "నికోలి ఫ్రమ్ లాస్ట్ నైట్" అంటూ ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఇలా మొదలైన చాటింగ్ తో 15 మంది నికోలీలు యూనివర్సిటీ దగ్గర కలుసుకున్నారు. దీంతో ఎంక్వైరీ కొత్తపుంతలు తొక్కింది. తన కోసం సోషల్ మీడియాలో, ఈ మెయిల్స్ లో చాలా మంది వెదుకుతున్నారని అసలైన నికోలికి తెలిసింది. ఆమెతో నికోలీ సమూహమంతా మాట్లాడి.. జెటినా ప్రయత్నాన్ని వివరించి.. వారిద్దరూ కలుసుకునేలా మధ్యవర్తిత్వం వహించారు. ఇక వారి ప్రయత్నంతో ప్రేరణ పొందిన నికోలి.. తన వంతుగా మరో 25 మంది నికోలీలను ఆ గ్రూప్ కు జత చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడా గ్రూపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

ఫలితంగా అసలైన నికోలి ఫోన్ నెంబర్ నుంచి జెటినాకు టెక్స్ట్ మెసేజ్ వెళ్లింది. ఇవాళో, రేపో వారిద్దరూ కలిసి కాఫీ తాగబోతున్నారు. కాఫీతో పాటు అందమైన ఊహల్లో తేల్చేసే కబుర్లు అదనం.