'ధోనీ లెక్క చాలా సార్లు తప్పింది'

'ధోనీ లెక్క చాలా సార్లు తప్పింది'

మహేంద్ర సింగ్ ధోనీ.. మేటి కీపర్‌.. సూపర్‌ ప్లేయర్‌.. అంతకు మించి తెలివైన కెప్టెన్‌. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకు అనుగుణంగా కెప్టెన్సీ చేయడంలో ఆరితేరిన ధోనీ అవసరానికి తగ్గట్లు అప్పటికప్పుడు ప్లాన్స్‌ మారుస్తుంటాడు. టీమిండియాకు సారథ్యం వహించినప్పటి నుంచే వేగంగా వ్యూహాలు రచించడంలో నైపుణ్యం సాధించిన ధోనీ.. విశ్లేషకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. యువ బౌలర్లు బౌలింగ్‌ చేసేటప్పుడు ధోనీ ఇచ్చే టిప్స్‌ ఎంతో విలువైనవని చెబుతుంటారు. 'మేం ఏ విధమైన బాల్‌ వేయాలో ధోనీ వికెట్ల వెనుక నుంచే చెబుతుంటాడు. ధోనీ కంటి చూపు చాలు. ఆ చూపులోనే బోలెడంత అర్థం ఉంటుంది' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ చెప్పాడు. 

ఐతే.. ధోనీ ఇచ్చే సూచనలు చాలా సార్లు తప్పాయంటున్నాడు యువ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్. ధోనీ కూడా మానవమాత్రుడేనని, ఆయన సూచనలు చాలాసార్లు పనిచేయలేదని చెప్పుకొచ్చాడు. ముంబైలో జరిగిన సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ సందర్భంగా కుల్దీప్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ టిప్స్‌ చాలాసార్లు పనిచేయకపోయినా ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.