కాంగ్రెస్ అమరవీరులను మరచిపోయింది

కాంగ్రెస్ అమరవీరులను మరచిపోయింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఇండియా గేట్ సమీపాన 40 ఎకరాల్లో ఏర్పాటైన నేషనల్ వార్ మెమోరియల్ ను దేశానికి అంకితం చేశారు. 
దేశ రక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన సైనికులను స్మరించుకొంటూ ఏర్పాటు చేసిన స్మారక ఆవిష్కరణ సభలో ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పై రాజకీయ దాడి చేశారు. ఒక కుటుంబం కోసం గత ప్రభుత్వాలు సైనికులకు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. 

70 ఏళ్లుగా మెమోరియల్ కోసం డిమాండ్
‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లుగా ఈ మెమోరియల్ కోసం డిమాండ్ ఉంది. సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలవుతోంది. ప్రభుత్వం రూ.35,000 కోట్లు పంపిణీ చేసింది. రూ.500 కోట్లతో ఓఆర్ఓపీ అమలు చేయొచ్చని ఓ ప్రభుత్వం చెప్పేది. ప్రస్తుతం ఉన్న సైనికుల జీతాలు పెంచడం జరిగింది. మాజీ సైనికులు పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేశాం. డ్యూటీలో మరణించిన సైనికుల కుటుంబాలు కూడా పెన్షన్ పొందుతాయి. సైన్యం మనోబలమే దేశ మనోబలాన్ని నిర్ణయిస్తుందని’ ప్రధానమంత్రి చెప్పారు.

ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాల్లో భారతీయ సైన్యం 
‘ఇవాళ మన సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. దేశానికి సవాళ్లు ఎదురైనపుడల్లా మన సైనికులు ముందుండి మొదటి దెబ్బ కాసి జవాబిచ్చారు. లతా దీదీ యే మేరే వతన్ కే లోగో పాడినపుడు దేశంలోని కోట్లాది మంది కళ్లు చెమర్చాయి. నేను పుల్వామా అమరులకు నమస్కరిస్తున్నాను. కొత్త భారతదేశం కొత్త నీతి, కొత్త రీతితో ముందుకెళ్తోంది. ఇందులో పెద్ద భాగం సైనికుల శౌర్యం, క్రమశిక్షణకు చెందుతుందని’ ప్రధాని అన్నారు.

బోఫోర్స్, ఇతర కుంభకోణాల్లో ఒక కుటుంబం 
-కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ‘మా ప్రభుత్వం రాకముందు ఏం జరిగేదో చెబుతాను. తమను భారత భాగ్యవిధాతలుగా భావించేవాళ్లు సైనికులు, జాతీయ భద్రతతో చెలగాటమాడటంలో ఏ కొరత వదల్లేదు. 2009లో సైన్యం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కోరింది. కానీ 2014 వరకు ఐదేళ్ల పాటు వీటిని కొనలేదు. మేం 2 లక్షల 30 వేలకు పైగా జాకెట్లు కొన్నాం. మన జవాన్లను రక్షా కవచాల నుంచి వంచించిన పాపం చేశారు’ అని మోడీ విమర్శించారు.

-‘వాళ్లు సైన్యం, భద్రతలను సంపాదన మార్గాలుగా చేసుకొన్నారు. బహుశా అమరవీరులకు ఏం చేసినా వాళ్లకేం దక్కదనేమో, వాళ్లని మర్చిపోవడమే మంచిదనుకున్నారు. బోఫోర్స్, ఇతర కుంభకోణాల్లో ఒక కుటుంబం పేరు మాత్రమే ఉండటం ఎంతో చెబుతుంది. రాఫెల్ ఎగిరనపుడు వీళ్లకి జవాబు దొరుకుతుంది. జాతీయ ప్రయోజనాలను కొన్ని దశాబ్దాలుగా ఉపేక్షించిన నిర్ణయాలను మేం ఇప్పుడు తీసుకుంటున్నామని’ ప్రధాని తెలిపారు.