ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు

ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు

అటవీ అధికారులపై పోడు సాగుదారులు అర్ధరాత్రి దాడిచేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలకలం రేపుతోంది. జిల్లాలోని ముల్కలపల్లి మండలం గుండాలపాడు సమీపంలో కొంతమంది పోడుదారులు ట్రాక్టర్లతో అటవీశాఖకు చెందిన భూమిని దున్నేందుకు వెళ్లారు. వీరిని ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో రైతులు వారిపై దాడి చేశారు. రైతుల దాడిలో బీట్‌ ఆఫీసర్‌ భాస్కరరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ నీలమయ్య గాయాలయ్యాయి. అక్కడనుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ముల్కలపల్లి పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఉదయం ఫిర్యాదు చేశారు. మొత్తం మూడు ట్రాక్టర్లతో అర్ధరాత్రి భూములు దున్నుతున్నారు... ఆపడానికి వెళ్లిన మాపై దాదాపు 200 మంది దాడికి దిగినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 

ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ అధికారులు. తమ పరిధిలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్‌లో నిర్మాణం చేపట్టారని.. ఆ ప్రాంత ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ అధికారులను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వనమా కూడా తమను బెదిరించినట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నిర్మాణం కోసం తీసిని గుంతను పూడ్చివేయడంతో డిపార్ట్‌మెంటుకు ఆర్థికంగా నష్టం వచ్చిందంటున్నారు. ఈ ఘటన గత నెల 29వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, తనను లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే వనమా... ఆదివాసీల హక్కుల కోసమే తాను అక్కడికి వెళ్లానన్నారు. కాగా, కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఎమ్మెల్యే తమ్ముడి దాడిని మరువక ముందే మళ్లీ అదే తరహా ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.