కలకలం.. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే యత్నం..!

కలకలం.. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే యత్నం..!

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లు కొల్లగొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉపయోగపడే ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఆఖరి నిమిషంలో బ్యాంకు అధికారులు అలర్ట్‌ కావడం వల్ల కిలాడీగాళ్ల పాచిక పారలేదు. 

అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధ పడుతున్నవారు తమను ఆదుకోవాలంటూ చేసుకునే విజ్ఞప్తులకు స్పందించి... సీఎంఆర్ఎఫ్‌ విడుదల చేస్తారు. దీన్ని ఆసరాగా తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు... మూడు నకిలీ చెక్కుల్ని తయారు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్లు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39.86 కోట్లు, కోల్‌కత్తా సర్కిల్‌లోని మోగ్‌రాహత్‌ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్‌ కోసం ఎస్‌బీఐకి పంపారు. అయితే ఈ మూడు చెక్కులు బెజవాడ ఎంజీ రోడ్డు బ్రాంచికి చెందినవి కావడంతో అక్కడకు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కొన్నారు. దీంతో ఈ నకిలీ వ్యవహారం బయటపడింది. ఇటు ఈ మూడు చెక్కులపై రెవెన్యూ శాఖ సెక్రటరీ టు గవర్నమెంట్‌ అన్న స్టాప్‌... దానిపై సంతకం ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు దుంగడుల వివరాలు కనుక్కొనే పనిలో పడ్డారు.