మేఘాలయ గనిలో ఏం జరుగుతోంది?

మేఘాలయ గనిలో ఏం జరుగుతోంది?

కొన్ని నెలల క్రితం గుహలో వరదనీటిలో 17 రోజులు గడిపి ప్రాణాలతో బయటపడ్డ థాయిలాండ్ అండర్-16 ఫుట్ బాల్ జట్టు గురించి మరిచిపోలేం. పుట్టినరోజు వేడుక కోసం గుహలోకి వెళ్లిన 11-14 ఏళ్లలోపు 12 మంది పిల్లలు, వారితో కోచ్ భారీగా వరదనీరు చొచ్చుకువచ్చి ప్రవాహంతో పాటు వారందరినీ లోపలికి తీసుకెళ్లింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సహకారం అందించడంతో 17 రోజుల తర్వాత వారంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. మన దేశంలో ఈశాన్యాన ఉన్న మేఘాలయలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. రెండు వారాల క్రితం అక్రమంగా బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతున్న 15 మందికి పైగా కార్మికులు వరదనీటిలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు వారి జాడ లేదు. ఎక్కడ ఉన్నారో తెలియదు. ప్రాణాలతో ఉన్నారో, అసువులు బాసారో తెలియదు. మనతో పోలిస్తే సాంకేతికంగా, ఆర్థికంగా ఓ చిన్నదేశం సురక్షితంగా రక్షించగలిగితే టెక్నాలజీలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నామనే మన ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది.

మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ఉన్న లుంథరీ గ్రామానికి చెందిన ఒక కొండ ప్రాంతంలో 370 అడుగుల లోతైన అక్రమ గనిలో 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. డిసెంబర్ 13న హఠాత్తుగా వరదనీరు గనిలోకి చొచ్చుకు రావడంతో వారంతా బయటపడే దారిలేక దాదాపు రెండు వారాలుగా వారు అక్కడే కాలం గడుపుతున్నారు. ఓ వైపు పక్కనే ప్రవహిస్తున్న నది నుంచి వచ్చి పడుతున్న వరదనీరు, మరోవైపు తవ్వకాలు ఆపేసిన గని నుంచి చొచ్చుకువస్తున్న వరదనీరు కారణంగా సహాయచర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇన్నాళ్లూ రెండు 25 హార్స్ పవర్ పంపులతో అక్రమ గనిలో నిండిన వరదనీటిని బయటికి తోడిపోసేందుకు ప్రయత్నించారు. కానీ అది నిష్ప్రయోజనంగా మారింది. దీంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే పనులను నిరవధికంగా నిలిపేశారు.

సహాయచర్యలు చేపట్టేందుకు అవసరమైన పరికరాలు, ముఖ్యంగా గనిలో నుంచి వరదనీటిని బయటికి తోడి పోసే పంపులు లేనందువల్ల పనులు ఆపుతున్నట్టు చెబుతున్నారు. 100 హార్స్ పవర్ ఉన్న 10 పంపులు అవసరమని సహాయ సిబ్బంది సమాచారం ఇచ్చి వారానికి పైగా గడిచింది. ఆ పంపులు మేఘాలయ ప్రభుత్వం దగ్గర లేవని అధికారులు చెప్పారు. ‘ఇప్పటి వరకు మాకు జీవితులు, మృతులు ఎవరూ కనపడలేదు. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం వేచి చూస్తున్నామని’ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన ఉన్నతాధికారి ఎస్.కె. శాస్త్రి తెలిపారు. పనులు తిరిగి ప్రారంభించేందుకు అనుమతి కోసం ఎదురుచూపులు మొదలై రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఈ ఆపరేషన్ కోసం 70 అడుగుల లోతైన నీటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉన్న డైవర్లు 40 అడుగుల లోతు వరకు వెళ్లగలరు. వరదనీటిని పంపులు తోడి పోస్తే తప్ప తిరిగి సహాయచర్యలు ప్రారంభించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరదనీరు రెండు మార్గాల ద్వారా అక్రమ గనిలోకి చొచ్చుకు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సమీపాన ఉన్న ఒక నది నుంచి, అదే ప్రాంతంలో వదిలేసిన గని నుంచి భారీగా వరదనీరు అక్రమ గనిలోకి పెద్దఎత్తున వస్తోంది. థాయిలాండ్ ఆపరేషన్ లో సహకారం అందిస్తామని మన ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. కానీ మన దగ్గరే ఈ పరిస్థితి ఉంటే పొరుగు దేశాలు మన సహాయ సహకారాలను విశ్వసించగలవా? సాంకేతికంగా పురోగతి సాధించామని చెబుతున్న మాటలన్నీ డొల్లేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి.