బట్లర్‌ శతకం.. ఆసీస్‌ వైట్‌వాష్‌

బట్లర్‌ శతకం.. ఆసీస్‌ వైట్‌వాష్‌

సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అజేయ సెంచరీ చేసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు రాయ్(1), బరిస్టో(12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజ్ లోకి  వచ్చిన అలెక్స్ హేల్స్ కుదురుకుకోవడానికి సమయం తీసుకున్నాడు. మరోవైపు రూట్(1), కెప్టెన్ మోర్గాన్(0)లు కూడా అవుట్ అయ్యారు. ఈ దశలో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు.

అలెక్స్ హేల్స్(20), అలీ(16)లు కూడా పెవిలియన్ చేరడంతో 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా  పయనించింది ఇంగ్లాండ్ జట్టు. అనంతరం మరో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ విజయం ఖాయం అనుకున్న సమయంలో.. రషీద్ తో కలిసి జోస్ బట్లర్ అద్భుత బ్యాటింగ్‌తో 110(122 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో) అజేయ సెంచరీ చేసాడు. చివరలో రషీద్ ఔట్ అయినా జేక్ బాల్ తో కలిసి జట్టును విజయతీరాలకు తేల్చాడు. ఇంగ్లండ్‌ 48.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 208 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో 205  పరుగులకు ఆలౌట్ అయింది. తాజా విజయంతో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ తొలిసారి 5–0తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'ప్లేయర్ అఫ్ ది సిరీస్' బట్లర్‌కు దక్కాయి.