నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే

నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించడానికి ఇదే సరైన సమయం. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ను డ్రాగా ముగించి, ఆపై జరిగిన టెస్ట్ సిరీస్ ను(ఆసీస్ గడ్డపై తొలిసారి) చేజిక్కించుకుంది. మూడో వన్డే గెలిచి వన్డే సిరీస్‌ను సైతం సొంతం చేసుకుని పర్యటనను చిరస్మరణీయం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు వన్డే సిరీస్‌నైనా నెగ్గి పరువు  నిలబెట్టుకోవాలని ఆసీస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

మొదటి, రెండో వన్డేలో మన టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అందరూ ఫామ్ లోకి వచ్చారు. ఒక్క రాయుడు మినహాయిస్తే అందరూ పరుగులు చేశారు. సిడ్నీలో రాయుడుతో బౌలింగ్‌ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మూడో వన్డేకు రాయుడు అనుమానమే. ఈ స్థానం కోసం ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, కేదార్‌ జాదవ్‌లు పోటీపడుతున్నారు. ఇక బౌలింగ్ లో భువి, షమీ, కుల్దీప్ రాణిస్తున్నారు. అయితే సిరాజ్ ధారాళంగా పరుగులిస్తున్నా.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. చాహల్‌ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాకు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. లైయన్‌ స్థానంలో జంపా, పేసర్‌ బెహెండార్ఫ్‌ స్థానంలో స్టాన్‌లేక్‌ జట్టులోకి రానున్నారు.

తుది జట్లు  (అంచనా):

భారత్‌: 
రోహిత్‌ శర్మ, ధావన్‌, కోహ్లి, ధోని, కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌/విజయ్‌ శంకర్‌, జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌/సిరాజ్ , షమి.

ఆస్ట్రేలియా: 
ఫించ్‌, అలెక్స్‌ కరే, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హాండ్స్‌కాంబ్‌, స్టాయినిస్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, సిడిల్‌, జంపా, స్టాన్‌లేక్‌.