నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తడబడి ఆదిలోనే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 32 ప‌రుగులకే 4 వికెట్ల‌ను కోల్పోయింది. కమ్మిన్స్ 4 వికెట్లు తీసి టీమిండియా టాప్ ఆర్డర్ ను పెవిలియన్ పంపాడు. దీంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసామన్న ఆనందం త్వరగానే పోయింది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభయించిన టీమిండియా.. ఓపెన‌ర్ హ‌నుమ విహారి (13) వికెట్ ను ఆదిలోనే కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచ‌రీ చేసిన పుజారా రెండు బంతులు మాత్ర‌మే ఎదుర్కొని  డ‌కౌట‌య్యాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప‌రుగులేమీ చేయ‌కుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం ర‌హానే (1) రెండు బంతులను ఎదుర్కొని అవుట్ అయ్యాడు. మరోవైపు ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అగ‌ర్వాల్ (25), రోహిత్ (4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భార‌త్ 21 ఓవ‌ర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 ప‌రుగులు చేసింది. అంత‌కుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 151 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భార‌త్ ప్ర‌స్తుతం 335 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.