మెల్‌బోర్న్‌ టెస్టు: ఆసీస్ పై భారత్ విజయం

మెల్‌బోర్న్‌ టెస్టు: ఆసీస్ పై భారత్ విజయం

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ పై 137 పరుగులతో విజయం సాధించి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రోజు వర్షం కారణంగా ఆట ఒక సెషన్ పాటు తుడిపెట్టుకుపోయింది. లంచ్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయిన కొద్దిసేపటికే బుమ్రా.. కమ్మిన్స్ (63)ను అవుట్ చేసాడు. నిన్నటి నుండి భారత బౌలర్లను ఓ ఆటాడుకున్న కమ్మిన్స్ చివరి రోజు 2 పరుగులు చేసి అవుట్ య్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఇషాంత్.. లయాన్ (7)ను అవుట్ చేసి మ్యాచ్ ముగించాడు. చివరకు హేజిల్ వుడ్ (0) నాటౌట్ గా నిలిచాడు. 

399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. రెండవ ఇన్నింగ్స్ లో 89.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో కమ్మిన్స్ (63), షాన్ మార్ష్ (44), హెడ్ (34), ఖ‌వాజా (33)లు పరుగులు చేసారు. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా చెరో మూడు వికెట్లు.. ఇషాంత్, షమీ తలో  రెండు వికెట్లు సాధించారు. బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. అయితే టీమిండియాకు ఇది 150 టెస్ట్ విజయం. చివరి టెస్ట్ సిడ్నీలో జనవరి 3న ప్రారంభం కానుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 443/7 డిక్లేర్డ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 151
భారత్ రెండో ఇన్నింగ్స్‌: 106/8 డిక్లేర్డ్‌
ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ : 261