మహిళల టీ20 ప్రపంచ కప్‌ 'ఆసీస్'దే

మహిళల టీ20 ప్రపంచ కప్‌ 'ఆసీస్'దే

2018 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఖాతాలో నాలుగవ టీ20 ప్రపంచ కప్‌ చేరింది. ఆంటీగా వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 106 పరుగుల విజయ లక్ష్యంను ఆసీస్ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు హీలీ (22), మూనీ (14)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దూకుడుగా ఆడుతున్న హీలీ బోల్డ్ అయింది. మూనీ.. గార్డనర్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. ధాటిగా ఆడే క్రమంలో మూనీ కూడా పెవిలియన్ చేరింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ లాన్నింగ్ (28), గార్డనర్ (33)కు జత కలవడంతో ఆసీస్ సునాయాస విజయంను అందుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు షూట్, గార్డనర్‌లు చెలరేగడంతో ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ వ్యాట్ (43), కెప్టెన్ నైట్ (25)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగిలిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ అందరూ సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోర్ కే పరిమితమయింది. గార్డనర్ మూడు వికెట్లు తీసింది. 'ప్లేయర్ ఆఫ్ ది  మ్యాచ్' గార్డనర్‌కు దక్కింది. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' హీలీకి లభించింది.