అక్కడ ఎగ్జిట్‌పోల్స్‌ లెక్క తప్పాయి..

అక్కడ ఎగ్జిట్‌పోల్స్‌ లెక్క తప్పాయి..

ఎన్నికలు అంటే ఇప్పుడు సర్వేల పాత్ర కీలకమైంది. ఎన్నికల ముందే నేతలు తమ తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకోవడం ఓ ఎత్తైతే... ఇక పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు వెలువరించే ఎగ్జిట్ పోల్స్‌ పై అంతా ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయి. ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ నేతృత్వంలోని లిబరల్‌ కూటమి ‘అనూహ్య’ విజయం సాధించింది. శనివారం నాటి పోలింగ్‌లో ఈ కూటమి గరిష్ఠ సంఖ్యలో సీట్లను గెల్చుకొని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతోంది. విపక్ష లేబర్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ఈ ఫలితాలు పటాపంచలు చేశాయి. 151 సీట్లున్న ప్రతినిధుల సభలో ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరం. విపక్ష లేబర్‌ పార్టీకి 82 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కలు కట్టాయి. అయితే ఇప్పటి వరకు అధికార కూటమి 72 స్థానాల్లో ఘన విజయం సాధించగా... విపక్ష పార్టీకి 63 స్థానాలే దక్కాయి. దీంతో ఆ పార్టీ అధినాయకుడు బిల్‌ షార్టెన్‌ తన పార్టీ ఓటమిని అంగీకరించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులైన సందర్భాలు లేకపోలేదు.