ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ‘డ్రా’ విడుదల

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ‘డ్రా’ విడుదల

2019లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ‘డ్రా’ గురువారం విడుదలైంది. 2019లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ అవడంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు అందరూ టైటిల్ వేటలో ఉన్నారు. ఇందులో కొందరికి సులువైన ‘డ్రా’ ఎదురైతే.. మరికొందరికి కఠిన డ్రా ఎదురైంది. కెరీర్‌లో 100వ ఏటీపీ టైటిల్‌ వేటలో ఉన్న స్విస్ మాస్టర్ రోజర్‌ ఫెడరర్‌కు సులువైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్‌ ఇస్టోమిన్‌తో ఫెడరర్‌ తలపడతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 99వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్‌కు 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించాడు. అనుకున్న ప్రకారమే అన్ని మ్యాచ్‌లు సాగితే.. ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ మధ్య సెమీ ఫైనల్‌ పోరు జరుగుతుంది. మారిన్‌ సిలిచ్‌, బెర్నార్డ్‌ టామిక్, ఆండీ ముర్రే ఒకే పార్శ్వంలో ఉన్నారు. 

జొకోవిచ్‌ డ్రా మాత్రం కాస్త కఠినంగా ఉంది. రెండో రౌండ్‌లోనే అతను విల్‌ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌)ను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిషికోరి కూడా జొకోవిచ్‌ పార్శ్వంలోనే ఉన్నాడు. రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)కు ప్రిక్వార్టర్‌ వరకు ఇబ్బంది లేదు. క్వార్టర్స్‌లో వింబుల్డన్‌ రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే ప్రమాదం ఉంది. 

మహిళల విభాగంలో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు కూడా కఠిన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌లో తత్‌జానా మారియా (జర్మనీ)ను ఎదుర్కోనుంది. ఇక ప్రిక్వార్టర్స్‌లోనే వరల్డ్‌ నంబర్‌వన్‌ హలెప్‌ (రొమేనియా)తో తలపడే అవకాశం ఉంది. అంతకుముందు రెండో రౌండ్‌ ప్రత్యర్థి బౌచర్డ్‌ (కెనడా)నుంచి కూడా ప్రమాదం పొంచివుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా వోజ్నియాకీ (డెన్మార్క్‌) తన మొదటి పోరులో అలీసన్‌ వాన్‌ (బెల్జియం)ను ఎదుర్కొంటుంది. ఇక మూడో రౌండ్‌లో మరో స్టార్ మారియా షరపోవా (రష్యా)ను ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు. సోమవారం నుంచి ఆస్ట్రేలియన్‌ జరగనుంది.
Image By: www.tennisworldusa.org