ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ వరల్డ్ రికార్డ్ క్యాచ్

ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ వరల్డ్ రికార్డ్ క్యాచ్

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ ఎలిసా హీలీ అంతకు ముందే ఒక అద్భుతమైన వరల్డ్ రికార్డ్ సాధించింది. హీలీ ఇటీవలే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది.

ఎలిసా హీలీ తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. హీలీ ‘అత్యంత ఎత్తు నుంచి క్రికెట్ బాల్‘ క్యాచ్ పట్టిన రికార్డ్ సృష్టించింది. డ్రోన్ ద్వారా 80 మీటర్లకు పైగా ఎత్తు నుంచి జారవిడిచిన బంతిని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో (ఎంసీజీ) క్యాచ్ పట్టి హీలీ ఈ రికార్డ్ సాధించింది.

మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైన ఎలీసా తన మూడో ప్రయత్నంలో క్యాచ్ పట్టేసింది. దీంతో ఆమె ఇంగ్లాండ్ కి చెందిన క్రిస్టన్ బామ్ గార్ట్ నర్ పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టింది. బామ్ గార్ట్ నర్ 62 మీటర్ల ఎత్తు నుంచి వచ్చిన బంతిని క్యాచ్ పట్టాడు. బామ్ గార్ట్ నర్ కి ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పేరిట ఉండేది.ఈ అద్భుతమైన క్యాచ్ పట్టిన తర్వాత ‘మొదటి ప్రయత్నంలో బంతి వరకు నా చేయి వెళ్లలేదు. రెండోసారి బాల్ నా గ్లోవ్స్ కి తగిలి జారిపోయింది. దీంతో చాలా బాధ అనిపించింది‘ అని హీలీ చెప్పింది. మూడో ప్రయత్నంలో క్యాచ్ పట్టిన తర్వాత చాలా సంతోషం అనిపించిందని తెలిపింది.

ఎలీసా హీలీ ఎవరు?
ఎలీసా హీలీ ఆస్ట్రేలియా మహిళా జట్టు క్రికెటర్. ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్. ఎలీసా తన ఇంటర్నేషనల్ డెబ్యూ ఫిబ్రవరి 2010లో చేసింది. ఆమె తండ్రి గ్రెగ్ హీలీ క్వీన్స్ ల్యాండ్ కి ఆడేవాడు. బాబాయి ఇయాన్ హీలీ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు వికెట్ కీపర్ గా ఆడాడు. 24 మార్చి 1990లో జన్మించిన ఎలీసా తన టెస్ట్ డెబ్యూ 22 జనవరి 2011లో ఇంగ్లాండ్ పై చేసింది. ఫిబ్రవరి 2010లో న్యూజిలాండ్ పై వన్డే ఆరంగేట్రం చేసింది.