వరల్డ్‌కప్‌ మొదటి సెమీఫైనలిస్ట్‌ ఖరారు..

వరల్డ్‌కప్‌ మొదటి సెమీఫైనలిస్ట్‌ ఖరారు..

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా సెమీస్‌లోకి దూసుకెళ్లింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (100;116 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ నమోదు చేయగా.. డేవిడ్‌ వార్నర్‌(53; 61 బంతుల్లో 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలుత అంతగా ఆకట్టుకోని ఇంగ్లీష్‌ బౌలర్లు చివర్లో విజృంభించి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించారు. 30 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ ఒక్క వికెట్‌ నష్టానికి 162 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌ వంటి హిట్టర్లు ఉండటంలో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్నారు. అయితే చివరి ఓవర్లను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. స్మిత్‌(38), ఖవాజా(23), మ్యాక్స్‌వెల్‌(12), స్టొయినిస్‌(8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ రెండు వికెట్లతో రాణించగా.. ఆర్చర్‌, వుడ్‌, స్టోక్స్‌, మొయిన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.  

286 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. రెండో బంతికే ఓపెనర్‌ విన్స్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా రూట్‌ (8),  మోర్గాన్‌ (4), బెయిర్‌స్టో (27) వరుసగా పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లండ్‌ 56కే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో స్టోక్స్‌, బట్లర్‌ 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28వ ఓవర్లో బట్లర్‌ అవుటయ్యాక వోక్స్‌తో కలిసి 53 పరుగల భాగస్వామ్యాన్ని  నెలకొల్పాడు స్టోక్స్. ఈ దశళో స్టోక్స్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ విజయం లాంఛనమే అయింది. చివర్లో రషీద్‌ (25) మెరిపించినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.