ఓలా, ఉబరే కారణం..! కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై జోకులు..!

ఓలా, ఉబరే కారణం..! కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై జోకులు..!

కార్ల అమ్మకాల పతనంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భాష్యం చెప్పారు. కొత్త కార్లపై యువత ఆసక్తి చూపడం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈఎంఐల భారం భరించడానికి ఇష్టపడడం లేదు... ఓలా, ఉబెర్‌ లాంటి క్యాబ్‌లు, మెట్రో రైళ్లలో ప్రయాణించడానికే వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇదీ కార్ల అమ్మకాల పతనానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన కారణం. ఆటోమొబైల్ రంగం ఒడిదుడుకులకు లోనవుతుందంటే దానికి కారణం పన్నులు భారం కాదంటున్నారామె. నష్టాలకు నెపాన్ని యువత మీదకే నెట్టేశారు. యువత మైండ్‌ సెట్‌ మారడం వల్లే కార్ల అమ్మకాలు తగ్గాయన్నారు నిర్మలా సీతారామన్‌. అయితే నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ఈ కామెంట్స్‌ చేశారు. దేశంలో ఇటీవల కాలంలో బైక్‌లు, కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆగస్టులో అనూహ్యంగా 23.5 శాతం క్షీణించాయి ఆటోమొబైల్‌ అమ్మకాలు. 1997-98 తర్వాత మళ్లీ ఇప్పుడే ఆటోమొబైల్‌ సేల్స్‌ ఈ స్థాయి పడిపోయాయి. పోనీ ఆర్థిక మంత్రి చెప్పిన ట్యాక్సిల వాడకం పెరిగితే వాటి అమ్మకాలైనా పెరగాలి కదా! కానీ... కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు కూడా 19 శాతం క్షీణించాయి. ఆఖరికి టూవీలర్ల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం తగ్గాయి. వాహనాల సేల్స్‌ అకస్మాత్తుగా ఏమీ పడిపోలేదు. గత ఏడాది డిసెంబర్‌ నుంచే సేల్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. వాహన తయారీ రంగంపై మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే... అశోక్ లేలాండ్ లాంటి ఆటోమొబైల్ దిగ్గజాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 శాతానికిపైగా తగ్గించేశాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారు.

ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని చక్కదిద్దే చర్యలు చేపడతామన్నారు నిర్మలా సీతారామన్. పన్ను భారం తగ్గించే యోచన ఉందని... ఈ నెల 20న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామన్నారామె. కార్ల అమ్మకాల పతనానికి పన్నుల భారం కారణం కాదన్నా... జీఎస్టీ తగ్గించే యోచనలో ఉందనడం ఆటోమొబైల్‌ రంగానికి ఊరటనిచ్చే అంశమే. మొత్తానికి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్న ఆటోమొబైల్‌ రంగాన్ని కేంద్రం ఎలా ఆదుకుంటుందో చూడాలి.