కేట్ విన్స్ లెట్ బ్రీత్ లెస్ ఫీట్

కేట్ విన్స్ లెట్ బ్రీత్ లెస్ ఫీట్

సాధారణంగా కొన్ని థ్రిల్లర్ మూవీస్ గురించి ఓ మాట చెబుతారు! ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఊపిరిబిగబట్టి చూశారని అంటారు. అది నిజంగా... నిజం కాకున్నా... వాడేస్తుంటారు. ఇప్పుడు ఓ నటి మాత్రం తన రాబోయే చిత్రం కోసం నిజంగానే ఊపిరిబిగబట్టిందట! అదీ ఏడు నిమిషాలకు పైగానే! ఆమె బ్రీత్ లెస్ సీన్ చూస్తే... మనమూ గాలి పీల్చటం మర్చిపోతామట! ‘అవతార్’ గుర్తుందిగా! అసలు మరిచిపోయే సినిమానా అది అంటారా? నిజమే... జేమ్స్ క్యామరూన్ వెండితెర అద్భుతం ఆ సినిమా. అయితే, దానికి సీక్వెల్ రూపొందుతోంది. ‘అవతార్ 2’లో టైటానిక్ టాలెంటెడ్ బ్యూటీ కేట్ విన్స్ లెట్ కూడా ఉంది. ఆమె కీలక పాత్ర పోషిస్తోన్న ‘అవతార్ 2’ ఎప్పుడొస్తుందా అని ప్రపంచ వ్యాప్త అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాకపోతే, ‘అవతార్’ సీక్వెల్ కి ఇంకా చాలా టైమే ఉంది. ఆ లోపు సదరు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గురించి ఏ అప్ డేట్ వచ్చినా జనం చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ మధ్య కేట్ విన్స్ లెట్ షూటింగ్ సమయంలో తన అనుభవం గురించి నోరు విప్పింది... ఏడు నిమిషాల 14 సెకన్లు... అవును, కేట్ అంత సేపు నీళ్లలో మునిగిపోయి నటించిందట. ఆమె స్వయంగా తన యాక్టింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎక్స్ ప్లెయిన్ చేస్తూ... ‘’ ఆ సీన్ షూటింగ్ సమయంలో మైండ్ బ్లాంక్ అయ్యింది. నీటి బుడగలను చూడడం తప్ప నా మనసులో ఏ ఆలోచనా లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అనిపించింది. చనిపోయానని అనుకున్నాను కూడా!’’ అంటూ వివరించింది. అయితే, అంత ఒత్తిడికి లోనై ఆమె చేసిన హిస్టారికల్ సీన్ కి ఓ స్పెషాలిటి ఉంది. 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాలో టామ్ క్రూజ్ సిక్స్ మినిట్స్ అండ్ హాఫ్ సెకండ్ బ్రీతింగ్ చేయకుండా యాక్ట్ చేశాడు. ఇప్పటి వరకూ అదే రికార్డు. కానీ, కేట్ విన్స్ లెట్ ఏకంగా ఏడు నిమిషాలకు పైగా శ్వాసను స్థంబింపజేసి సరికొత్త వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది! చూడాలి మరి, ‘అవతార్ 2’ ఆడియన్స్ ముందుకొచ్చాక ఇంకెన్ని రికార్డులు బద్ధలవుతాయో!