రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృత సినిమా 'నభాంసి'

రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృత సినిమా 'నభాంసి'

న్యూయార్క్, అమెరికాలో స్థిరపడినభారతీయుడు రామ్ అల్లాడి ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్.   'చేసిల్డ్' డాక్యుమెంటరీతో దర్శకుడిగా మారి 11 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దర్శకుడిగా రెండో యత్నంలో జాతిపిత మహాత్మాగాంధీపై తీసిన 'రాస్ మెటనోయా' చిత్రానికి 14 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇప్పుడు రామ్ అల్లాడి ఓ సంస్కృత సినిమా తీస్తున్నారు. దానికి 'నభాంసి' అనే పేరు పెట్టారు. అంటే ఆకాశాలు అని అర్థం. ఈ చిత్రాన్ని పూర్తిగా సంస్కృతంలో తెరకెక్కించనున్నారు. రామ్ అల్లాడి తో 'మెటనోయా' తీసిన ఏఆర్ ఐటీవర్క్స్ సంస్థ నే 'నభాంసి' ని నిర్మిస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ మొదలైంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా 8న చిత్రీకరణ ప్రారంభం కానుంది. వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంలోజరిగిన కథగా ఈ సినిమా తీస్తున్నారట. భార్యాభర్తల మధ్య జరిగే రొమాంటిక్ కథ ఇది. చిన్ననాటి జ్ఞాపకాల్ని చేధిస్తూ భార్యతో చేసే రొమాన్స్ ఇది. ఓ విధంగా అర్ధ నారీశ్వర తత్త్వం అని చెప్పవచ్చు. సాహిత్యం, సంగీతం, నృత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుమరుగైన కొన్ని నృత్యాలనుమా చూపిస్తారట. ఆ కాలం నాటి సెట్స్, కాస్ట్యూమ్స్ సిద్ధం చేయిస్తున్నారట. సీజీ వర్క్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండే ఈ సినిమాలో 75 శాతం అమెరికాలో తీస్తామంటున్నారు. మరో 25 శాతం మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో చేయనున్నారు.

ఇందులో ప్రధాన పాత్రలు అన్నిటినీ ప్రవాస భారతీయులు పోషిస్తారట. సంస్కృతంలో 'నభ' అంటే 'ఆకాశం' అని అర్థం. 'నభాంసి' అంటే ఆకాశాలు అని అర్థం. కన్నడ దర్శకుడు జీవీ అయ్యర్ సంస్కృతంలో తొలి సినిమా'ఆదిశంకరాచార్య' చేశారు. తర్వాత సంస్కృతంలోనే 'భగవద్గీత' తెరకెక్కించారు. రెండూ ప్రజాదరణ పొందాయి. పురస్కారాలు అందుకున్నాయి. ఆ రెండూ చూసినప్పుడు సంస్కృతంలో సినిమా చేయాలని అనుకున్నాడట రామ్ అల్లాడి. 'ఆదిశంకరాచార్య', 'భగవద్గీత' తర్వాత సంస్కృతంలో పెద్దగా సినిమాలు రాలేదు. ఒకరిద్దరు మలయాళ దర్శక, నిర్మాతలు చేశారంతే. 'నభాంసి' కోసం రామ్ అల్లాడి సంస్కృతం కూడా నేర్చుకున్నారట. 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి  సంభాషణలు : సరితా నవాలి, మధు గుంటుపల్లి, ఎడిటర్: రాకేష్ చల్లా, సినిమాటోగ్రఫీ: రామ్ అల్లాడి - సతీష్ రొంటల, మ్యూజిక్ డైరెక్టర్: భరద్వాజ్ వి. కొమరగిరి, స్క్రీన్ ప్లే - డైరెక్షన్: రామ్ అల్లాడి.