యాక్సిస్ బ్యాంక్ పనితీరు ఓకే

యాక్సిస్ బ్యాంక్ పనితీరు ఓకే

గత మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,505.06 కోట్ల నికర లాభం ఆర్జించినట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.2,188.74 కోట్ల నికర నష్టం పొందింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో  బ్యాంక్‌ ఆదాయం  రూ.18,324.31 కోట్లు  సాధించినట్టు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.14,559.85 కోట్ల ఆదాయంతో  25.86 శాతం  పెరిగింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో ఆపరేటింగ్ లాభం రూ.5,014 కోట్లు కాగా,  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం వృద్ధి సాధించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 21 శాతం పెరిగి రూ. 4730 కోట్ల నుంచి రూ.5,706 కోట్లకు చేరింది.  లాభదాయికతకు ప్రామాణికమైన నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.44 శాతంగా ఉన్నట్టు యాక్సిస్ బ్యాంక్ చెప్పింది.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే  మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక రుణాలు 5.26 శాతానికి తగ్గినట్టు యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.  స్థూల నిరర్థక ఆస్తులు, నికర నిరర్థక ఆస్తులు వరుసగా నాలుగు త్రైమాసికాలుగా తగ్గినట్టు చెప్పింది.