భార‌త్‌లో మ‌రో భారీ మోసం..! బ్యాంకుల‌కు రూ.1200 కోట్లు టోపీ..!

భార‌త్‌లో మ‌రో భారీ మోసం..! బ్యాంకుల‌కు రూ.1200 కోట్లు టోపీ..!

దేశంలో ఇప్ప‌టికే ప‌లువురు బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు బ్యాంకుల‌కు వంద‌ల కోట్లు, వేల కోట్లు ఇలా.. కుచ్చు టోపీ పెట్టి విదేశాల్లో త‌ల‌దాచుకున్నారు..  వారిని స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు సీబీఐ, ఈడీ చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు.. తాజాగా మ‌రో భారీ మోసం వెలుగు చూసింది.. బ్యాంకుల‌కు ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ ఏకంగా రూ.1,204 కోట్లు మోసం చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి... ఆ సంస్థే కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ లిమిటెడ్‌.. రెండు బ్యాంకులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌.. ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశాయి.

కొటక్ మ‌హీంద్రా బ్యాంక్ 2012 నుండి కాక్స్ అండ్ కింగ్స్ లిమిటెడ్.. యూకేకు చెందిన ట్రావెల్ సంస్థకు ఆర్థిక సదుపాయాలను విస్తరించిందని పేర్కొంది. 2019 జూన్‌లో కాక్స్ అండ్‌ కింగ్స్ మొత్తం 174.3 కోట్ల రూపాయల రుణం తీసుకున్న‌ట్టు ఫిర్యాదు చేసింది.. ఇక‌, కాక్స్ అండ్‌ కింగ్స్ యొక్క కొందరు అధికారులు రూ. 1,030 కోట్ల రుణ సదుపాయాలను పొందారని మరియు తిరిగి చెల్లించకుండా బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిర్యాదు చేసింది. కంపెనీపై నిధుల మళ్లింపు అనుమానంతో ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ కోసం ఆడిటింగ్‌ కంపెనీ ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ని బ్యాంకులు నియమించాయి. కంపెనీ పలు అక్రమాలకు పాల్పడినట్లు కన్పిస్తోందని ఆడిటింగ్‌ సంస్థ తన ప్రాథ‌మిక నివేదికలో పేర్కొంది. కంపెనీకి 15 సంస్థల నుంచి రూ. 449 కోట్లు రావాల్సి ఉందని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ పేర్కొనడాన్ని ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ అనుమానిస్తోంది. ఇవన్నీ దొంగ కంపెనీలుగా భావిస్తోంది. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కంపెనీ పేర్కొన్న అడ్రస్‌లకు వెళ్ళగా అక్కడ ఈ 15 కంపెనీలు లేవని పోలీసులు అంటున్నారు. అయితే కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కంపెనీ సీఈవో మాత్రం.. ఇది కేవలం విచారణ మాత్రమేనని చెప్పుకొచ్చారు.