అయోధ్య కేస్: 1% ఛాన్సున్నా మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తాం

అయోధ్య కేస్: 1% ఛాన్సున్నా మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తాం

అయోధ్యలో రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ భూమి వివాదం పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్ట్ ఇవాళ సలహా ఇచ్చింది. సంబంధాలను చక్కదిద్దే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పింది. ఈ కేసును కోర్టు నియమించిన మధ్యవర్తికి అప్పజెప్పాలా వద్దా అనేది మార్చి 5న ఆదేశిస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. రాజకీయ దృష్టికోణంలో అత్యంత సున్నితమైన ఈ భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వానికి 1 శాతం అవకాశం ఉన్నా పరిశీలించాలని అభిప్రాయపడింది. రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ ఎస్‌ కె బోబ్డే, జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.

ఈ కేసులోని అన్ని పార్టీలకు ఆరు వారాల్లోగా అన్ని దస్తావేజుల కాపీలను అందజేయాలని బెంచ్ కోర్టు రెజిస్ట్రీకి సూచించింది. ఈ కేసును 8 వారాల తర్వాత విచారిస్తామని చెప్పింది. ఈ ఎనిమిది వారాల ఈ వ్యవధిని మధ్యవర్తిత్వ అవకాశాలు పరిశీలించేందుకు వినియోగించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ తర్వాత ఈ కేసును విచారిస్తామంది. ఈ భూమి వివాదానికి పరిష్కారం సాధించేందుకు మధ్యవర్తిని నియమించాలన్న కోర్టు ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు కొందరు ముస్లిం పార్టీలవారు చెప్పారు. అయితే రామ్ లలా విరాజ్ మాన్ సహా కొందరు హిందూ పార్టీలవారు మాత్రం దీనికి అభ్యంతరం తెలిపారు. ఇంతకు ముందు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు.

ఈ భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ అవకాశాలను పరిశీలిస్తారా అని ధర్మాసనం అన్ని పార్టీలను ప్రశ్నించింది. '1 శాతం అవకాశం ఉన్నా మధ్యవర్తిత్వం జరపాలి. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం అంతా సంపత్తి కోసమేనని మీరు గుర్తించగలుగుతున్నారా? మేం కేవలం సంపద అధికారాలను మాత్రమే నిర్ణయించగలం. కానీ మేం సంబంధాలను చక్కదిద్దే అవకాశాలను గురించి ఆలోచిస్తున్నాం' అని కోర్టు చెప్పింది. 

బెంచ్ విచారణ ప్రారంభిస్తూనే దస్తావేజుల అనువాదంపై సాధారణ అంగీకారం ఉంటే మిగతా ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పింది. విచారణ ప్రారంభమయ్యాక అనువాదాలపై ఎవరూ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఈ కేసులో దస్తావేజుల స్థితి, సీల్డ్ రికార్డ్ ల గురించి సుప్రీంకోర్ట్ సెక్రటరీ జనరల్ రిపోర్ట్ ప్రతులను ప్రస్తావిస్తూ ఇరు పక్షాల వకీళ్లు ఈ ప్రతులను పరిశీలించాల్సిందిగా చీఫ్ జస్టిస్ సూచించారు.