అయోధ్య వివాదం: ఫిబ్రవరి 26న విచారణ జరపనున్న సుప్రీంకోర్ట్

అయోధ్య వివాదం: ఫిబ్రవరి 26న విచారణ జరపనున్న సుప్రీంకోర్ట్

అయోధ్య కేసును సుప్రీంకోర్ట్ ఫిబ్రవరి 26న విచారణ జరపనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సభ్యుడైన జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే సెలవుపై వెళ్లారు. ఆయన ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. ఈ బెంచ్ లో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.ఏ. నజీర్ సభ్యులుగా ఉన్నారు. అయోధ్య కేసు విచారణ కోసం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 25 జనవరిన ఏర్పాటు చేయడం జరిగింది.

అలహాబాద్ హైకోర్ట్ 2010లో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగు సివిల్ కేసుల్లో తీర్పునిస్తూ అలహాబాద్ హైకోర్ట్ ఈ వ్యవహారంలోని మూడు పార్టీలు-సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లాలా మధ్య 2.77 ఎకరాల భూమిని సరిసమానంగా పంచాలని చెప్పింది. అయోధ్య కేసు విచారణ కోసం ఈ ఏడాది జనవరి 8న ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో ముందు జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్ లను చేర్చలేదు.

బెంచ్ సభ్యుడైన జస్టిస్ యు.యు.లలిత్ జనవరి 10న స్వయంగా విచారణ నుంచి వైదొలగడంతో బెంచ్ పునర్వ్యవస్థీకరించబడింది. 1997లో ఒక కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరఫున వాదించినందువల్ల తాను ఈ కేసులో భాగం కాదలచుకోలేదని జస్టిస్ లలిత్ తెలిపారు.