అచ్చతెలుగు మల్ల యోధుడిగా రానా

అచ్చతెలుగు మల్ల యోధుడిగా రానా
తెలుగులో బయోపిక్ హవా మొదలైంది.  మహానటి తెలుగు బయోపిక్ సినిమాలకు నాంది పలికింది.  మహానటి తరువాత వరసగా చాలా బయోపిక్ లు తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నది.  ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ వస్తున్నది.  మరోవైపు మరికొంత మంది జీవిత కథలు కూడా లైన్లో ఉన్నాయి.  ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కథ తెరపైకి వచ్చింది.  
 
బాహుబలి తరువాత దగ్గుబాటి రానాకు వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ యువనటుడు.  ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, 1945, మరాట్వాడా మహారాజు, హాథీ మేరీ సాథీ వంటి సినిమాలతో వినూత్నంగా దూసుకుపోతున్న రానా స్వాతంత్ర సమర యోధుడు, మల్లయుద్ధంలో ఓటమి యెరుగని ధీరుడిగా గుర్తింపు పొందిన కోడి రామ్మూర్తి నాయుడి జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందబోతున్నది.  ఈ సినిమాలో రానా ఆ మల్లయుద్ధ యోధుడిగా కనిపించబోతున్నాడు.  
 
దాదాపు 5000 పోటీల్లో పాల్గొన్న కోడి రామ్మూర్తి నాయుడికి ఓటమి అనేది లేదట.  అప్పట్లో ఈ యోధుడి ప్రతిభకు మెచ్చి కింగ్ జార్జ్ ఇండియన్ హెర్క్యులస్, కలియుగ భీమ వంటి బిరుదులు ఇచ్చి సత్కరించారు.  కోడి రామ్మూరి నాయుడు గోదాలో ప్రదర్శించిన పరాక్రమం భారత స్వతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచిందట. మల్లయుద్ధంలో, బాడీ బిల్డింగ్ ప్రావీణ్యం పొందిన రామ్మూర్తి నాయుడు జీవిత కథను సినిమాగా తీస్తుండటం గొప్ప విషయం.  ఈ సినిమాను సౌత్ టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో ఒకటి నిర్మిస్తుంది.  అంతేకాదు, హాలీవుడ్ సంస్థ కూడా ఈ నిర్మాణంలో భాగం కానున్నట్టు సమాచారం.  ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ అగ్రదర్శకుడితో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట.  త్వరలోనే ఈ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు సమాచారం.