దశాబ్దంలో మాఫీ చేసిన రుణాల్లో 80% మోడీ సర్కార్ హయాంలోనే

దశాబ్దంలో మాఫీ చేసిన రుణాల్లో 80% మోడీ సర్కార్ హయాంలోనే

భారీగా పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులతో (ఎన్పీఏ) తంటాలు పడుతున్న బ్యాంకుల్లో ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సొమ్ము వేసి వాటిని బయట పడేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం డిసెంబర్ 2018తో ముగిసిన నెల వరకు రూ.1,56,702 కోట్ల మేరకు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఇలా 10 ఏళ్లలో బ్యాంకులు మొత్తం రూ.7,00,000 కోట్ల కంటే ఎక్కువ రుణాలను మాఫీ చేశాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ మేరకు గత 10 ఏళ్లలో రైటాఫ్ చేసిన మొత్తం రుణాల్లో 80 శాతం గత ఐదేళ్లలో అంటే 2014 తర్వాతే రద్దయ్యాయి.

ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ దాఖలు చేసిన ఒక అర్జీకి జవాబుగా ఆర్బీఐ ఈ వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ 2014 తర్వాత రూ.5,55,603 కోట్ల రుణాలు రైటాఫ్ చేయడం జరిగింది. బ్యాడ్ లోన్ లను తక్కువగా చూపించేందుకు బ్యాంకులు 2016-17లో రూ.1,08,374 కోట్లు, 2017-18లో రూ.1,61,328 కోట్లు రుణాలను రైటాఫ్ చేశాయి. 2018-19 గత ఆర్నెల్లలో బ్యాంకులు రూ.82,799 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. అక్టోబర్-డిసెంబర్ 2018 త్రైమాసికంలో రైటాఫ్ చేసిన మొత్తం రూ.64,000 కోట్లకు చేరుకుంది.

రుణగ్రహీతల గుర్తింపు, వ్యక్తిగత రుణగ్రహీతల విషయంలో రైటాఫ్ చేసిన మొత్తం గురించి చాలా తక్కువ సమాచారం తమ దగ్గర ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. రుణాలను రైటాఫ్ చేసిన తర్వాత కూడా వసూలు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు బ్యాంకులు అంటున్నాయి. ఇప్పటికి 15-20 శాతం కంటే ఎక్కువ వసూళ్లు జరగలేదని బ్యాంకింగ్ వర్గాల సమాచారం. ప్రతి ఏడాది రైటాఫ్ గణాంకాలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వం గత ఏడాది బ్యాంకుల బెయిల్ ఔట్ కోసం రూ.2.11 లక్షల కోట్లకు రీకాపిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రకటించింది. బ్యాంకులు ఇప్పుడు రూ.10,00,000 కోట్ల కంటే ఎక్కువ ఎన్పీఏల భారంతో విలవిలలాడుతున్నాయి. డిఫాల్టర్ల పేర్లు బహిరంగ పరచాలని బ్యాంక్ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల బ్యాడ్ లోన్లకి చాలా వరకు బడా వ్యాపారవేత్తలే బాధ్యులనేది సుస్పష్టం.