రివ్యూ: బద్లా హిందీ మూవీ

రివ్యూ: బద్లా హిందీ మూవీ

 

నటీనటులు: అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి, అమృతా సింగ్‌, టోనీ ల్యూక్‌, మానవ్‌ కౌల్‌ తదితరులు

మ్యూజిక్: అమాల్‌ మాలిక్‌

సినిమాటోగ్రఫీ: అవిక్‌ ముఖోపాధ్యాయ్‌

నిర్మాణ సంస్థ: రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అజ్యూర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సుజాయ్‌ ఘోష్‌

అమితాబ్ బచ్చన్, తాప్సి కాంబినేషన్లో గతంలో పింక్ సినిమా వచ్చింది.  లీగల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  ఈ సినిమా హిట్ కావడంతో ఈ కాంబినేషన్లో మరో సినిమాకు ప్లాన్ చేశారు దర్శకుడు సుజాయ్ ఘోష్.  2017 లో స్పానిష్ లో వచ్చిన ది ఇన్విజిబుల్ గెస్ట్ సినిమాను రీమేక్ చేస్తూ బద్లా సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.  

కథ: 

మిస్టరీగా మారిన హత్యను ఎలా ఛేదించారు అన్నది సినిమా.  కథ విషయానికి వస్తే... తాప్సి తన ప్రియుడు మానవ్ కౌల్ తో కలిసి ఓ హోటల్ గదిలో ఉన్న సమయంలో ప్రియుడు హత్యకు గురవుతాడు.  ఈ నేరం తాప్సిపై పడుతుంది.  ఇద్దరు హోటల్ గదిలో ఉండగా ఎవరో కౌల్ ను హత్య చేశారని తాప్సి చెప్తుంది.  ఆ గదిలో మూడో వ్యక్తి ఎవరు లేకపోవడంతో నేరం ఆమె చేసిందని ఆరోపణలు వస్తాయి. ఈ ఆరోపణల నుంచి బయట పడేందుకు దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న అమితాబ్ ను ఆశ్రయిస్తుంది.  తాప్సి వివరాలు తెలుసుకున్న అమితాబ్ ఏం చేశారు..? కేసును ఎలా సాల్వ్ చేశారు..? అసలు మానవ్ కౌల్ ను చంపింది ఎవరు అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వరసగా వస్తున్నాయి.  సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటె అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది.  థ్రిల్లింగ్ లో ఉండే సమస్యలను ఛేదించుకుంటూ వెళ్లే సమయంలో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా ఉంటుంటాయి.  బద్లా సినిమాలో కూడా ఇదే ఫార్ములా అప్లై అయింది.  స్పానిష్ లో వచ్చిన ది ఇన్విజిబుల్ గెస్ట్ సినిమా ఎలా ఉన్నదో.. ఇంచుమించు అలానే దించేశారు.  కొద్దికొద్ది మార్పులతో అంతే.  సినిమాలో ఏం చూపించాలని అనుకున్నారో అదంతా ఫస్ట్ హాఫ్ లో చూపించారు.  సెకండ్ హాఫ్ లో మర్డర్ మిస్టరీని అమితాబ్ ఎలా ఛేదించారో చూపించారు.  మిస్టరీ ఛేదించే క్రమం చాలా ఆసక్తిగా చూపించడంలో సఫలం అయ్యాడు దర్శకుడు.  

నటీనటుల పనితీరు: 

అమితాబ్, తాప్సిలు సినిమాకు కీలకం.  ఈ రెండు పాత్రల చుట్టే సినిమా నడుస్తుంది.  అమితాబ్ నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తాప్సి ఒదిగిపోయి నటించింది.  అమృత సింగ్, టోనీ ల్యూక్ లు పాత్ర సినిమాకు కీలకం.  వీరిద్దరూ దానికి తగ్గట్టుగా నటించి మెప్పించారు.  మిగతా పాత్రల్లో నటీనటులు వారి పరిధిమేరకు మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు: 

క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు.  ప్రతి సీన్ ను ఉత్కంఠ భరితంగా చూపించాలి.  అప్పుడే సక్సెస్ కాగలుగుతారు.  ఈ విషయంలో దర్శకుడు సుజాయ్ ఘోష్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.  ఒరిజినల్ సినిమాను అలానే మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి చూపించి విజయం సాధించాడు.  థ్రిల్లర్ సినిమా కాబట్టి పాటలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  రెడ్ చిల్లీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

చివరిగా: బద్లా ..థ్రిల్లింగ్ ను కలిగించింది.