రాయుడుకు మళ్లీ నో ఛాన్స్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌..!

రాయుడుకు మళ్లీ నో ఛాన్స్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌..!

తెలుగు తేజం, టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడుకు మళ్లీ నిరాశే ఎదురైంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడాలన్న రాయుడి కల.. కలగానే మిగిలేలా కనిపిస్తోంది. గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ ఇవాళ తప్పుకోవడంతో ఆ స్థానంలో రాయుడుకు పిలుపు వస్తుందని అంతా భావించారు. కానీ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపినట్టు తెలిసింది. మరికొన్ని గంటల్లోనే మయాంక్‌ ఇంగ్లండ్‌కు బయలుదేరుతాడని బీసీసీఐ అధికారి ఒకరి వెల్లడించారు. 

వరల్డ్‌కప్‌కు 15 మందితో జట్టును ఎంపిక చేసిన సమయంలో రాయుడు, పంత్‌లను స్టాండ్‌బైలుగా ఉంచినట్టు సెలెక్టర్లు చెప్పడంతో టోర్నీ మధ్యలో ఎవరైనా గాయపడితే వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఓపెనర్‌ ధావన్‌ గాయపడడంతో ఆ ప్లేస్‌లో పంత్‌ను పిలిపించారు సెలెక్టర్లు. ఇప్పుడు విజయ్‌ శంకర్‌ గాయపడడంతో రాయుడుకి పిలుపు రావాల్సి ఉండగా అనూహ్యంగా మయాంక్‌ను రప్పిస్తున్నారు. 

నంబర్‌ 4లో బ్యాటింగ్‌ చేస్తున్న విజయ్‌ ప్లేస్‌లో రాయుడును సెలెక్ట్‌ చేయకుండా మయాంక్‌కు ఛాన్స్‌ ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. '3డీ గ్లాసెస్' అంటూ సెలెక్టర్లపై రాయుడు సెటైరేయడం వల్లే అతడిని పక్కన పెడుతున్నారన్నది చాలా మంది అభిప్రాయం. ప్రపంచ కప్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో సెలెక్టర్లు 'ఇగో'ను పక్కనపెట్టాలని ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు. 

మయాంక్‌ ఎంపిక వెనుక టీమ్‌ మేనేజ్‌మంట్‌ ఆలోచన వేరేలా ఉన్నదని తెలుస్తోంది. నంబర్‌ 4లో కేఎల్‌ రాహుల్ రాణిస్తుండడంతో అతడిని మళ్లీ అదే స్థానంలో ఆడించి.. మయాంక్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఐతే.. వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీల్లో ప్రయోగాలు చేయడం మంచిది కాదని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

ఇక.. మయాంక్‌ విషయానికొస్తే.. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు.