చెన్నైకి సన్‌రైజర్స్ షాక్..

చెన్నైకి సన్‌రైజర్స్ షాక్..

ఐపీఎల్ 2019లో ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రేక్‌లు వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. బుధవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌ స్పాట్‌లో ఉన్న చెన్నై జట్టును చిత్తుగా ఓడించి, గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 133 పరుగుల టార్గెట్‌ను 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై సూపర్ విక్టరీ సాధించింది హైదరాబాద్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసస్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి 9.5 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను బౌల్డ్ చేశాడు నదీమ్. ఆ తర్వాత డుప్లిసిస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 13 పరుగులు చేసిన రైనాను పెవిలియన్‌కు పంపాడు రషీద్ ఖాన్, అదే ఓవర్‌లో కేదార్ జాదవ్‌ను ఔట్ చేశాడు. బిల్లంగ్స్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అంబటిరాయుడు, రవీంద్ర జడేజా కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో స్పల్ప స్కోరుకే పరిమితమైంది చెన్నై. అంబటి రాయుడు 21 బంతుల్లో 25 పరుగులు చేయగా... 20 బంతులు ఆడిన రవీంద్ర జడేజా కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్వల్ప లక్ష్యచేధనలో హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో అద్భుతంగా రాణించారు. డేవిడ్ వార్నర్ 25 బంతుల్లోనే 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, బెయిర్ స్టో 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొదటి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియంసన్ 3 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు, దీపక్ హుడా 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే ఇన్నింగ్స్ చివరి దాకా నిలిచిన బెయిర్ స్టో... సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.