కార్యకర్తలను బూట్లతో తొక్కారు !

కార్యకర్తలను బూట్లతో తొక్కారు !


కరీంనగర్‌లో నిన్న ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాబు డెడ్‌ బాడీని కరీంనగర్‌ డిపో వద్దకు తరలించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి.. మృతదేహాన్ని బలవంతంగా స్మశాన వాటికకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రామగుండం ఏఆర్‌ ఏసీపీ నాగయ్య బండి సంజయ్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై బీజేపీ నేతలు తిరగబడ్డారు.

పోలీసుల తీరును నిరసిస్తూ సీపీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. ఏసీపీ నాగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ ఆఫీసు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అడిషనల్ ఎస్పీ సంజీవ్ దురుసుగా మాట్లాడటంతో మళ్లీ వివాదం రాజుకుంది. నాలుగు గంటలు కొనసాగిన బండి సంజయ్ ధర్నా పోలీస్ ఉన్నతాధికారుల హామీతో విరమించారు. అడిషనల్‌ ఎస్పీ సంజీవ్ సారీ చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇక ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన పోలీసుల తీరు పై మండి పడ్డారు. తెలంగాణ తల్లిని నలిచేస్తున్నారని ఏబివిపి కార్యకర్తను బూట్లతో తొక్కారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కు కరీంనగర్ అంటే భయమని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. పోలీసులు విచక్షణ రహితంగా వ్యవహరించారని,  బాబు కుటుంబాన్ని వేదించారని, మాస్కులు ధరించి మరీ పోలీసులు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.