ఇది నియంత్రిత సాగు విధానం కాదు..నిర్భంద సాగు విధానం.:బండి సంజయ్
తెలంగాణలో నియంత్రిత సాగు విధానం,పార్టీ వైఖరి పై బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు విధానం నియంత్రితమైంది కాదు..నిర్భంధ సాగు విధానమని అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవసాయ సంస్కరణలకు, పంట కాలనీలకు వ్యతిరేకం కాదు. కానీ ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా, నిపుణులను సరిగా సంప్రదించకుండా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్భంధ సాగు విధానాన్ని తీసుకురావడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోందన్నారు. అసలు ఈ పంటలకు రైతుబంధుకు లంకె పెట్టడాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.పంట మార్పిడి విధానం విజయవంతం కావాలంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచించిన విధంగా భూసార పరీక్షలు నిర్వహించి, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేస్తే విజయవంతమైన ఫలితాలు వస్తాయని సూచించారు. అంతేకాని అశాస్త్రీయంగా పంట సాగు విధానం తీసుకురావడం ఏమాత్రం సరికాదని రైతులకు నష్టదాయకమని తెలిపారు. అసలు రాష్ట్రంలో భూసార కార్డులు ఇచ్చేందుకు కేంద్రం విడుదల చేసిన రూ. 125 కోట్లు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఇంతవరకూ ఏ రైతుకూ భూసార పరీక్షలు చేసి కార్డులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మరి, ఏ ఆధారంతో పంట మార్పిడి చేయాలంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. త్వరలోనే ఈ విషయంపై రైతుసంఘాల నాయకులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి దీనిపై సమగ్ర కార్యచరణను బిజెపి రూపొందిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పంటసాగు విధానంపై కూలంకుశంగా చర్చించాలని, అదేవిధంగా రైతు సంఘాలతో సైతం ఈ విధానంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)