టీఆర్ఎస్, ఎంఐఎం అక్రమ సంబంధం మరోసారి బహిర్గతం..!

టీఆర్ఎస్, ఎంఐఎం అక్రమ సంబంధం మరోసారి బహిర్గతం..!

గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇవాళ్టి పరిణామాలతో టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైందని.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ చెప్పిన విషయమే నిజమైందన్నారు.  టీఆర్ఎస్-ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటు బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని ఆరోపించిన సంజయ్.. రెండు కలిసి పోటీ చేయక పోయిఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని.. టీఆర్ఎస్‌ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు రుజువైందన్నారు. 

ఇక, జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌ స్టీరింగ్.. ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని జోస్యం చెప్పారు బండి సంజయ్.. సిగ్గు లేక ఎన్నికల్లో మేం వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. నీతివంతమైన రాజకీయం చేసేదుంటే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సింది.. కానీ, ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మా బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. మరోవైపు.. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను సహించరు.. అవకాశం వచ్చినా ప్రతి సారి కర్రు కాల్చి వాత పెడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్.