వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం

వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం

వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌ మళ్లీ చెలరేగింది. మరో మేటి జట్టును చిత్తు చేసింది. భారీ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్‌ చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మరో 51 బంతులు  మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. షకిబ్‌, లిటన్‌ దాస్‌ రెచ్చిపోవడంతో వెస్టిండీస్‌ చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. హోప్‌ (121 బంతుల్లో 96; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లూయిస్‌ (67 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేశారు.

322 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే విక్టరీ నమోదు చేసింది. షకీబ్‌ అల్‌ హసన్‌ (99 బంతుల్లో 124 నాటౌట్‌; 16 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (69 బంతుల్లో 94 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు సౌమ్య సర్కార్‌ (23 బంతుల్లో 29), తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 48) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. సర్కార్‌ అవుటయ్యాక వచ్చిన షకీబ్‌.. ఆది నుంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 69 పరుగులు జోడించాక వచ్చిన ముష్ఫికర్‌ 1 పరుగుకే వెనుదిరిగాడు. ఈ దశలో క్రిజ్‌లోకి వచ్చిన లిటన్‌ దాస్‌తో కలిసి షకీబ్‌.. విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. షకీబ్‌ 83 బంతుల్లో 100, లిటన్‌ దాస్‌ 43 బంతుల్లో 50 పూర్తిచేసుకున్నాడు. 38వ ఓవర్లో లిటన్‌.. ఏకంగా హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టు మరపురాని విజయాన్ని అందించారు.