గెలిస్తేనే సెమీస్‌కు..! నేడు బంగ్లాతో ఢీ

గెలిస్తేనే సెమీస్‌కు..! నేడు బంగ్లాతో ఢీ

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఇవాళ మరో ఆసక్తికరమైన పోరు సాగనుంది... ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్తున్న బంగ్లాను కట్టడి చేసేందుకు టీమిండియా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ముగ్గురు సీమర్లను ఆడించే యోచనలో ఉంది. లోయర్ ఆర్డన్ పటిష్ఠం చేసేందుకు చాహల్‌ను తప్పించి భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇక, ఈ టోర్నీలో ఏ మాత్రం ప్రభావం చూపని కేదార్ జాదవ్‌ను పక్కనబెట్టి.. ఆల్ రౌండర్ జడేజాను తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్ మంచి పోరాపటిమను ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాకు షాకిచ్చి ఆ తర్వాత వెస్టిండీస్‌ను మట్టికరిపించి సెమీస్‌ రేసులో నేనున్నాంటూ పోరాటం చేస్తోంది. మహ్మదుల్లా, షకీబుల్ హాసన్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం కాగా... బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న షకీబుల్ హాసన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. రహీం కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా ఫామ్‌లోకి వస్తే ఆ జట్టు భారీ స్కోరు చేయడానికైనా, లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడానికైనా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, బౌలింగ్ వీక్‌గా ఉండటం ఆ జట్టును వేధిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్-బంగ్లా తలపడనున్నాయి. ఆదివారం భారత్‌, ఇంగ్లాండ్‌ ఆడిన పిచ్‌ మీదే ఇవాళ మ్యాచ్‌ జరుగనుంది.