మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశీ నటుడు

మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశీ నటుడు

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీలు ప్రతి రాజకీయ ఎత్తుగడను ఉపయోగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ ప్రచారానికి బంగ్లాదేశీ సూపర్ స్టార్ ఫిర్దౌస్ అహ్మద్ రాయిగంజ్ వచ్చారు. మమతా బెనర్జీ పార్టీ తరఫున ఫిర్దౌస్ రోడ్ షో చేస్తున్నారు. సోమవారం ఉత్తర దీనాజ్ పూర్ జిల్లాలోని రాయిగంజ్ లో టీఎంసీ అభ్యర్థి కన్హయ్యా లాల్ అగర్వాల్ తరఫున ఫిర్దౌస్ రోడ్ షో నిర్వహించారు. ఆయన రోడ్ షో నిర్వహించిన అనంతరం ఈ రాత్రి బంగ్లాదేశ్ తిరిగి వెళ్తారు.

'బంగ్లాదేశ్ లో ఫిర్దౌస్ సుప్రసిద్ధ నటుడు. ఆయనను రోడ్ షోకి రావాలని మేం ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని ఆయన మన్నించారని' అగర్వాల్ ఎలక్షన్ ఏజెంట్ ముషర్రఫ్ హుసేన్ చెప్పారు. ఆదివారం ఫిర్దౌస్ ర్యాలీకి మంచి ప్రజాస్పందన లభించిందని అందువల్ల సోమవారం కూడా ఆయనతో ప్రచారం చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాయిగంజ్, హేమతాబాద్ ర్యాలీలో ఫిర్దౌస్ తో పాటు టాలీవుడ్ నటులు పాయల్ సర్కార్, అంకుష్ కూడా ఉన్నారని హుసేన్ వివరించారు. ఇవాళ ఫిర్దౌస్ అహ్మద్ కరన్ దిఘి, ఇస్లాంపూర్ లలో కూడా టీఎంసీ తరఫున ప్రచారం చేస్తారు. 

ఎన్నికల ప్రచారానికి టీఎంసీ బంగ్లాదేశీ నటుడిని పశ్చిమ బెంగాల్ కి తీసుకు రావడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 'ఒక భారత రాజకీయ పార్టీ విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తిని తన రాజకీయ రోడ్ షోకి ఎలా ఆహ్వానిస్తుంది? ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సంఘటన జరిగినట్టు వినలేదు. పార్టీకి భారతీయ కళాకారులెవరూ దొరకలేదా? రేపు మమతా బెనర్జీ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ని కూడా టీఎంసీ తరఫున ప్రచారం చేయాలని పిలిచేలా ఉన్నారు. భారత ప్రజాస్వామ్య పండుగకు ఒక బంగ్లాదేశీ సినిమా స్టార్ రావడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని' అన్నారు. 

'బంగ్లాదేశీ కళాకారుడైన ఫిర్దౌస్ ని ప్రచారానికి రప్పించి టీఎంసీ, ఉత్తర దీనాజ్ పూర్ లోని 50 శాతం ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. తృణమూల్ మమ్మల్ని చూసి భయపడుతోంది. అందుకే విదేశీ కళాకారులను పిలిపిస్తోందని' ఘోష్ విమర్శించారు. ఈ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందిందని, దీనిని పరిశీలిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.