రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అనేక కోట్ల బ్యాంక్ మోసం కేసులో గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్ కి చెందిన రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం అటాచ్ చేసింది. స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అటాచ్ మెంట్ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. విదేశాలలో ఉన్న ఆస్తులు సహా జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.9,778 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి కంపెనీ రూ.5,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. ఇవి నిరర్థక ఆస్తులు మారాయని ఆరోపణ. రుణాల మోసం మొత్తం రూ.8,100 కోట్లుగా ఉంటుందని తెలిసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జి షీట్ ఆధారంగా ఈడీ బ్యాంకు మోసం కుంభకోణంపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కంపెనీ ప్రమోటర్లు, వడోదరాకు చెందిన సందేసరా సోదరులు ఈ బ్యాంకు మోసానికి ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఉన్నాయి. వీరు పరారీలో ఉన్నారు.