గోరఖ్ పూర్ బీజేపీ అభ్యర్థిగా భోజ్ పురి సూపర్ స్టార్ రవికిషన్

గోరఖ్ పూర్ బీజేపీ అభ్యర్థిగా భోజ్ పురి సూపర్ స్టార్ రవికిషన్

బీజేపీ ఇవాళ తమ 21వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గోరఖ్ పూర్ నుంచి భోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్ ను బరిలోకి దింపింది. మొదట రవికిషన్ జౌన్ పూర్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల చెప్పు విసిరిన ఘటనతో వార్తల్లో నిలిచిన శరద్ త్రిపాఠీకి టికెట్ నిరాకరించి సంత్ కబీర్ నగర్ నుంచి ప్రవీణ్ నిషాద్ ను పోటీలో నిలిపింది. ప్రతాప్ గఢ్ నుంచి సంగమ్ లాల్ గుప్తా, అంబేడ్కర్ నగర్ నుంచి ముకుట్ బిహారీ, దేవరియా నుంచి రమాపతి రామ్ త్రిపాఠీ, జౌన్ పూర్ నుంచి కేపీ సింగ్, భదోహీ నుంచి రమేష్ బింద్ లకు టికెట్లు ఇచ్చారు.

భోజ్ పురి నటుడైన రవికిషన్ 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ తన అదృష్టం పరీక్షించుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్ పై ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ సీటు నుంచి పోటీ చేశారు. కానీ మోడీ వేవ్ లో ఆయనకు ఓటమి తప్పలేదు. జౌన్ పూర్ నుంచి బీజేపీకి చెందిన కేపీ సింగ్ విజయం సాధించారు. ఈ మధ్యే బీజేపీలో చేరడంతో రవికిషన్ ఈ సారి బీజేపీ టికెట్ పై జౌన్ పూర్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన స్వస్థలం జౌన్ పూర్ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. కానీ పార్టీ ఆయనను సీఎం యోగీ ఆదిత్యనాథ్ కంచుకోట గోరఖ్ పూర్ నుంచి పోటీకి దింపింది.