నిఫ్టీకి అండగా నిలిచిన బ్యాంకులు

నిఫ్టీకి అండగా నిలిచిన బ్యాంకులు

అమెరికా, చైనా మధ్య చర్చల తేదీ ఖరారు కావడంతో ఒక్కసారి అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లోకి వచ్చేశాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లలో రక్తపాతమే. నాస్‌డాక్‌ మూడు శాతం క్షీణించగా, ఇతర సూచీలు రెండున్నర శాతం దాకా నష్టపోయాయి. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య  చర్చల తేదీ ఖరారు కావడంతో ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఒకదశలో 10628 పాయింట్లకు అంటే 50 పాయింట్ల దాకా నష్టపోయిన నిఫ్టి తరవాత కోలుకుని 10741 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 55 పాయింట్ల లాభంతోఒ 10727 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 181 పాయింట్లు లాభపడింది.  ఇవాళ మార్కెట్లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు అండగా నిలిచాయి. నిన్న భారీగా క్షీణించిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఇవాళ ఏకంగా 11 రూపాయిలు లాభపడింది. అలాగే ఎస్‌బీఐ నేతృత్వంలోనే అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా లబ్ది పొందాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా 5 శాతంపైగా లాభంతో ముగిసింది. ఒక్క ఐటీ షేర్ల కౌంటర్‌ మినహా మిగిలిన షేర్ల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టిలో 33 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో లాభాలతో ముగిసిన వాటిలో ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌ బ్యాంక్‌, వేదాంత, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ముందున్నాయి. ఇక నష్టాలతో ముగిసిన షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హీరో మోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఉన్నాయి. చురుగ్గా ట్రేడైన ఇతర షేర్లలో పీఎన్‌బీ 5 శాతం, జేసీ అసోసియేట్స్‌ 5 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి.