ఇవాళే 'బీసీ గర్జన'.. టీడీపీకి జగన్ షాకిస్తారా?

ఇవాళే 'బీసీ గర్జన'.. టీడీపీకి జగన్ షాకిస్తారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇవాళ బీసీ గర్జన జరగనుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ అధినేత జగన్‌.. 'బీసీ డిక్లరేషన్‌' ద్వారా స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్‌షిప్‌ పక్కనే మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభమవుతుంది. పరిశ్రమల స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏపీఐఐసీలో భూములు కేటాయిస్తున్నట్టుగానే.. బీసీలకు కూడా ఇవ్వడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు వంటి విషయాలపై జగన్‌ హామీలు ప్రకటించనున్నారని తెలిసింది. ఎన్నికల్లో బీసీలకిచ్చే సీట్ల విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ సైతం తన పాదయాత్రలో వివిధ బీసీ వర్గాల ప్రజల్ని కలిసి వారికి ఏం కావాలో తెలుసుకున్నారు. ఇవాళ్టి బీసీ డిక్లరేషన్‌లో ఈ అంశాలన్నీ ఉండనున్నాయి. ఇక.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఈ సభకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.