పాక్ ను బహిష్కరించాలన్న భారత్ వినతికి ఐసీసీ తిరస్కరణ

పాక్ ను బహిష్కరించాలన్న భారత్ వినతికి ఐసీసీ తిరస్కరణ

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై బహిష్కరించడం తమ పరిధిలోకి రాదని ఐసీసీ స్పష్టం చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి సోమవారం తెలిపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో ఐసీసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. 'బోర్డుతో చర్చలు జరిపిన తర్వాత ఉగ్రవాదాన్ని పోషించే దేశాలను బహిష్కరించడం ఐసీసీ పరిధిలో లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేసినట్టు' చౌదరి అన్నారు.

గతంలో బీసీసీఐ రెండు అంశాలను ప్రస్తావిస్తూ ఐసీసీకి లేఖ రాసింది. అందులో ఆటగాళ్లు, అభిమానుల భద్రత ఒకటి కాగా భారత్, ఇతర సభ్యదేశాలు ఉగ్రవాదం వ్యాపింపజేసే దేశాలతో ఆడకూడదనేది రెండో అంశం. కశ్మీర్ లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచ కప్ లో భారత్ పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్ పెరిగింది. జూన్ 16న వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో భారత్, పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

'ఆటగాళ్లు, అభిమానుల భద్రత గురించి మా ప్రధాన ఆందోళన. దీనికి తగిన చర్యలు చేపట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఈసీబీ ప్రతినిధి కోలిన్ గ్రేవ్స్ కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేశారని' చౌదరి తెలిపారు. వరల్డ్ కప్ కు భారత జట్టు గురించి మాట్లాడుతూ ఎంపికపై మేనేజ్ మెంట్ నిర్ణీత కాలవ్యవధిని పాటిస్తుందన్నారు. 'ఆటగాళ్ల ఎంపిక ఎంతో కీలకమైన అంశం. ఆటగాళ్ల ఎంపికకు ఐసీసీ ఇచ్చిన గడువును పాటిస్తామని" చెప్పారు.