ఆగని ఐపీఎల్‌ వేదికల రగడ...

ఆగని ఐపీఎల్‌ వేదికల రగడ...

ఐపీఎల్‌ నిర్వహణ వేదికలపై.. ప్రధానంగ హైదరాబాద్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తజేస్తున్నాయి. ఈ నిర్ణయం తమ మూడు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని... సొంతగడ్డపై సత్తాచాటుతున్న జట్లే ఐపీఎల్‌లో రాణిస్తున్నాయనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సొంతగడ్డపై ఐదు లేదా ఆరు విజయాలు నమోదు చేస్తూ ప్లేఆఫ్‌కు దూసుకెళ్తున్నాయనీ... బీసీసీఐ నిర్ణయంతో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయి జట్లకు స్థానిక అనుకూలత లభిస్తుందనీ.. తమ మ్యాచ్‌ల్ని బయటే ఆడాల్సి ఉంటుందనీ.. అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఏ ఫ్రాంచైజీకి కూడా సొంతగడ్డ కాని అహ్మదాబాద్‌ను.. ఐపీఎల్‌ మ్యాచ్‌కు వేదికగా ఎంపిక చేయడంపై మూడు జట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేస్తున్నాయి.

ఐపీఎల్‌ వేదికల ఎంపికపై తమ అభ్యంతరాల్ని మూడు ఫ్రాంచైజీలు విడివిడిగా బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. వేదికలపై బోర్డు పునరాలోచించాలంటూ మూడు ఫ్రాంచైజీలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నాయి.  ఐపీఎల్‌ ఆతిథ్యం కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం.. కరోనా రెండో దశ ప్రభావం కనిపిస్తుండటాన్ని మూడు ఫ్రాంచైజీలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలు లేని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ సన్‌రైజర్స్‌ గట్టిగా పట్టుబడుతోంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ బీసీసీఐ, ఐపీఎల్‌ కార్యవర్గ సభ్యులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే మ్యాచ్‌లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. దానికి మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ కూడా మద్దతు తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదిక కాగల సత్తా హైదరాబాద్‌కు ఉందని స్పష్టం చేశారు.

అయితే  బీసీసీఐ మాత్రం మూడు ఫ్రాంచైజీలను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఫ్రాంచైజీలకు చెబుతోంది. గత ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తోంది.  కానీ అన్ని జట్లకు యూఏఈ తటస్థ వేదిక కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఫ్రాంచైజీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు 5 జట్లు సొంతగడ్డపై ఆడటం తమ అవకాశాల్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన చెందుతున్నాయి. బోర్డు నిర్ణయంతో క్రికెటే కాకుండా వ్యాపార పరంగానూ తమకు  నష్టమేనంటున్నాయి. అయితే, వేదికల  ఎంపికపై బీసీసీఐ.. తన పని తాను చేసుకుపోతోంది. ఈ నెలాఖరులోపు వేదికల్ని ప్రకటిస్తామని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించింది. మరి అసంతృప్తిగా ఉన్న ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.