నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మొతేరా పిచ్‌....

నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మొతేరా పిచ్‌....

మొతేరా పిచ్‌ఫై వివాదం చెలరేగడంతో.. బీసీసీఐ రూట్‌ మార్చినట్లు కనిపిస్తోంది. స్పిన్‌ పిచ్‌ కాకుండా.. మొతేరాలో బ్యాటింగ్‌ పిచ్‌ను సిద్దం చేస్తోంది. మరోవైపు నాలుగో టెస్ట్‌కి బూమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటానంటూ టీమ్‌కి తెలపడంతో అతన్ని పక్కనపెట్టింది బీసీసీఐ. 

నాలుగో టెస్ట్‌కి రెండు జట్లు సిద్ధమవుతున్నాయ్‌. టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఆఖరి మ్యాచ్‌ను డ్రాగా ముగించినా టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఓటమిపాలైతే లార్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్‌ 18న జరగనున్న ఫైనల్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధిస్తుంది.
   
మొతేరా పిచ్‌ఫై విమర్శలు రావడంతో బీసీసీఐ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. నాలుగో టెస్ట్‌ కోసం బ్యాటింగ్‌ పిచ్‌ను రెడీ చేస్తోంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. భారీ స్కోర్లు సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పిచ్‌పై ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి ఫిర్యాదు కూడా ఇవ్వలేదు అని బీసీసీఐ చెబుతోంది. 

మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కి వేదికను ప్రకటించింది బీసీసీఐ. పుణేలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ చెబుతోంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వాహణకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుగా అంగీకరించలేదు. తర్వాత ప్రేక్షకులు లేకుండా ఆడేందుకు ఓకే చెప్పింది. టెస్ట్‌ సిరీస్‌ తర్వాత.. మొతేరాలోనే T20మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత వన్డే మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.