కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు.. నిబంధనలు ఖరారు..

కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు.. నిబంధనలు ఖరారు..

బీసీసీఐ కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సభ్యుడు గగన్‌ ఖోడా స్థానంలో కొత్త మెంబర్లను తీసుకుంటారు. ఈ ఎంపికకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది బీసీసీఐ. సీనియర్‌తో పాటు మహిళల సెలక్షన్‌ కమిటీని బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. జూనియర్‌ కమిటీలో మాత్రం రెండు మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 24ను చివరి తేదీగా ప్రకటించింది. ఇక... ఆసక్తిగల అభ్యర్థులను క్రికెట్‌ సలహా సంఘం ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంతకు ముందు ప్రతిపాదించినట్టుగానే మదన్‌ లాల్‌, గౌతమ్‌ గంభీర్‌, సులక్షణ నాయక్‌ ఇందులో సభ్యులుగా ఉంటారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. 

బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎంపికకు నిబంధనలు రూపొందించారు. అర్హత వయసు 60కి కుదించారు. దీంతో ఆశావహుల్లో ముందున్న దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అవకాశం కోల్పోయినట్లయింది. అయితే... బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థులకు వయసు 60 లోపు ఉండాలి. అభ్యర్థి కనీసం 7 టెస్టులు... లేదంట్ 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడి ఉండాలి. 10 వన్డేలు లేదంటే 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల అనుభవం అవసరం. ఇక, అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదు సంవత్సరాలైనా అయి ఉండాలి. జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థుల సెలక్టర్లకు 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల అనుభవం అవసరం. మహిళల సెలక్షన్‌ కమిటీకైతే అభ్యర్థులు టీమిండియా తరఫున కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా సరిపోతుంది.